పోరుకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు.. రాబోయే 50 రోజులు అత్యంత కీలకం

Next 50 days are very crucial,50 days are very crucial,next 50 days crucial,bjp, BRS, Congress, telangana, Telangana Assembly Elections, Telangana Politics,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News
telangana

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. పోలింగ్‌కు కేవలం యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. అత్యంత కీలకంగా మారిన యాభై రోజులను సద్వినియోగ పరుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించేశారు గులాబీ బాస్. అన్ని పార్టీల కంటే ముందే తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. అటు రేపో.. మాపో కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగనున్నాయి.

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే.. ప్రజలకు చేసిన సేవే తమను గెలిపిస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అటు సీఎం కేసీఆర్ అనారోగ్య సమస్యలతో ఇంటిపట్టున్న ఉండాల్సి వచ్చినప్పటికీ.. పార్టీ బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు తీసుకొని విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం.. కొత్త కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం వంటివి చేస్తూ హోరెత్తించారు. అదే సమయంలో పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా సంతృప్తి పరుస్తూ ముందుకు కదులుతున్నారు.

అటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. నిమిషం తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ రాకముందే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు షెడ్యూల్ కూడా రావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచేశారు. మరింత ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కేసీఆర్.. త్వరలో రంగంలోకి దిగనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 15 నుంచి కేసీఆర్ ప్రచారాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించాయి. మరి ముందుగా అనుకున్నట్లుగా కేసీఆర్ ప్రతి జిల్లాల్లో సభ నిర్వహిస్తారా? లేదా? చూడాలి.

అసలు రాష్ట్రంలో కనుమరుగైపోతుందనుకున్న కాంగ్రెస్ ఎవరూ ఊహించని రీతిలో పుంజుకుంది. బీఆర్ఎస్‌ నుంచి పలువురు దిగ్గజ నేతలు చేరడంతో ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం చేకూరినట్లు అయింది. అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఈసారి తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఢిల్లీ నుంచి అగ్రనేతలను రంగంలోకి దింపి హోరెత్తించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించి ప్రజల్లోకి దూసుకెళ్లారు.

అయితే బీఆర్ఎస్‌తో పోలిస్తే మాత్రం ప్రచారంలో కాంగ్రెస్ కాస్త వెనుక పడిందనే చెప్పాలి. షెడ్యూల్‌కు నెలరోజుల ముందే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికీ అగ్రస్థాయి నేతలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలామునకలవుతున్నారు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు బయటకు రావడంతో.. అసంతృప్తులు పోరుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానంతో కొట్లాడేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే ఏది ఏమయినప్పటికీ.. ఇటీవల ప్రకటించిన ఆరు హామీలే తమను గెలిపిస్తామయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీనే గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. కానీ అంతా తలకిందులైపోయింది. ఎవరూ ఊహించనట్లుగా కాంగ్రెస్ ఊపందుకుంటే.. బీజేపీ మాత్రం పాతాలంలోకి దిగజారిపోయింది. పార్టీలో అంతర్గత సమస్యలు, సీనియర్లను పక్కన బెట్టడం వల్ల పార్టీ వెనుకపడిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి.. కిషన్ రెడ్డిని నియమించినప్పటి నుంచి పార్టీ పతనమ ప్రారంభమయింది.

ఇక పార్టీ లేవడం కష్టమని అనుకున్న సమయంలో సరిగ్గా ఎంట్రీ ఇచ్చారు ప్రధాని మోడీ. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో సభలు నిర్వహించి హోరెత్తించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ప్రకటించి ఓటర్లను తమ వైపు తిప్పుకున్నారు. అదే సమయంలో కేసీఆర్‌పై ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను ఎన్డీయేలో చేర్చుకోవాలని కేసీఆర్ తనను సంప్రదించారని.. అందుకు తాను ఒప్పుకోలేదని మోడీ వ్యాఖ్యానించారు. అటు అమిత్ షా కూడా రంగంలోకి దిగి.. పార్టీలో కొంత ఊపుతీసుకొచ్చారు. దీంతో మొన్నటి వరకు కాస్త వెనుకబడిన బీజేపీ.. ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =