నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు

TDP Rajya Sabha Candidates Sana Satish, Bhashyam Ramakrishna and Chintakayala Vijay File Nominations

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ పేర్లను ప్రకటించి, వారికి బి-ఫారాలను అందజేశారు.

ఈ క్రమంలో అభ్యర్థులు సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులు ముందుగా రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు పూజలు నిర్వహించి, అక్కడినుంచి సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 10.45 గంటలకు నామినేషన్లు సమర్పించారు.

కాగా, వీరి నామినేషన్లను కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చారు. ఇక వీరిలో సానా సతీశ్‌ రెండోసారి రాజ్యసభకు వెళుతుండగా.. భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనుండటం విశేషం. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల నిబద్ధత, మరియు యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు

  • సానా సతీశ్ బాబు: ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఈయనను పార్టీ రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈయన పదవీ కాలం జూన్ 21తో ముగియనుండటంతో, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సతీశ్‌కు చంద్రబాబు మళ్లీ అవకాశం కల్పించారు.

  • భాష్యం రామకృష్ణ: ప్రముఖ విద్యాసంస్థల అధినేత (భాష్యం గ్రూప్ చైర్మన్) అయిన ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న రామకృష్ణ ఈ నామినేషన్ ద్వారా మొదటిసారి పార్లమెంట్ ఎగువ సభలో అడుగుపెట్టబోతున్నారు.

  • చింతకాయల విజయ్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్, టీడీపీ ఐటీ విభాగానికి (ITDP) నేతృత్వం వహిస్తున్నారు. బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈయన, గత ప్రభుత్వ కాలంలో డిజిటల్ మీడియా వేదికగా పార్టీ తరఫున గట్టిగా పోరాడారు.

కూటమి ఒప్పందం – జనసేనకు ఒక సీటు

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ, ఎన్డీఏ కూటమి ఒప్పందంలో భాగంగా మూడు స్థానాలను టీడీపీ తీసుకోగా, మిగిలిన ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. జనసేన తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ ఇప్పటికే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమికి స్పష్టమైన భారీ మెజారిటీ ఉండటంతో, నామినేషన్లు దాఖలు చేసిన ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here