హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు

America President Donald Trump, Donald Trump, Donald Trump Live News, first lady melania trump, Hyderabad House, Mango News Telugu, Modi Trump bilateral talks, PM Modi, President Kovind, Prime Minister Narendra Modi, Trump At Hyderabad House, Trump India Visit News, US President Donald Trump
ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై ట్రంప్, మోదీ సంతకాలు చేశారు. ఈ చర్చల్లో ముఖ్యంగా మూడు ఎంవోయూలు కుదుర్చుకునట్టుగా తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య మానసిక ఆరోగ్యంపై సహకారం, సేఫ్టీ ఆఫ్‌ మెడికల్‌ ప్రొడక్ట్స్‌, ఇంధన రంగానికి సంబంధించి ఒప్పందాలు జరిగినట్టు సమాచారం. ద్వైపాక్షిక చర్చలు అనంతరం ఇరు దేశాధినేతలు ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. నిన్న మొతేరా స్టేడియంలో జరిగిన అద్భుతమైన స్వాగత కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ట్రంప్‌తో తనకిది ఐదో భేటీ అని, భారత్‌-అమెరికా మైత్రి 21వ శతాబ్దంలోనే కీలక భాగస్వామ్యాలలో ఒకటిగా నిలిచిపోతుందని చెప్పారు.
భారత్‌-అమెరికా సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాలకు సంబంధించినవి కావని, ప్రజలు కోసం ప్రజలే కేంద్రంగా ఇలా కొనసాగుతూనే ఉంటాయన్నారు. తమ మధ్య చర్చల సందర్భంగా అత్యాధునిక రక్షణ, భద్రత, టెక్నాలజీ అంశాలపై చర్చించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికా అత్యాధునిక ఆయుదాలు, భారత్‌ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, అందుకోసం ఇరుదేశాలు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, మాదకద్రవ్యాల ఉగ్రవాదంపై కూడా ఒప్పందాలు జరిగాయని అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల ఆర్థిక మంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయని, ఇప్పటికే ఒక అవగాన కుదిరిందని చెప్పారు. అలాగే అమెరికాతో పూర్తి స్థాయి ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ట్రంప్‌ భారత్ పర్యటన రెండు దేశాల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తనకు అద్భుతమైన స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్‌-అమెరికా మధ్య 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. 5జీ సాంకేతిక, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలపై కూడా చర్చించామన్నారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడతాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఆ దేశంతో కలిసి అమెరికా ప్రయత్నిస్తుందని చెప్పారు. అలాగే భారత్‌తో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా జరుగుతున్న చర్చల్లో ఏంతో పురోగతి సాధించామని, త్వరలోనే వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సాయంత్రం ఐదు గంటలలోపు ట్రంప్‌ మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలలో నిర్వహించిన హ్యాపీనెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడా చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =