పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని విధంగా చోటుచేసుకున్న భారీ తిరుగుబాటు పరిణామాలు, వరుస రాజీనామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో తీవ్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీల చీలికలు ప్రారంభమై, వారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించిన తరుణంలో.. ఆ పార్టీని తిరిగి జాతీయ కాంగ్రెస్ పార్టీలో (INC) విలీనం చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రతిపాదించారు.
ఢిల్లీ వేదికగా మంగళ, బుధవారాల్లో ఇరు పార్టీల అధినేతల మధ్య జరిగిన సుదీర్ఘ అంతర్గత భేటీల్లో ఈ విలీన అంశం చర్చకు రాగా, దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మమతా బెనర్జీ కొంత సమయం కోరినట్లు సమాచారం.
పార్టీ చేజారే ప్రమాదం – ఢిల్లీ వేదికగా సోనియా, మమత భేటీ
-
టీఎమ్‌సీలో భారీ చీలిక: ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కోల్పోయి, అక్కడ బీజేపీ పాలన ప్రారంభమైన నాటి నుండి తృణమూల్‌లో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో ఏకంగా 64 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. లోక్‌సభలో ఉన్న 28 మంది ఎంపీల్లో 20 మంది కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో విడిపోయారు. తాము ప్రత్యేక సమూహంగా విడిపోయి ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని, తమను లెజిస్లేటివ్ పార్టీగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ రాయడంతో పార్టీ గుర్తు, జెండా మరియు ఆస్తులు మమతా బెనర్జీ చేతుల్లోంచి జారిపోయే అత్యంత క్లిష్ట పరిస్థితి ఏర్పడింది.
-
కీలక పదవుల ఆఫర్: ఈ భయంకర రాజకీయ ఒత్తిళ్ల మరియు బీజేపీ వ్యూహాల నుంచి తృణమూల్‌ను రక్షించుకోవడానికి కాంగ్రెస్‌లో విలీనమే ఏకైక మార్గమని సోనియాగాంధీ సూచించారు. ఒకవేళ విలీనానికి అంగీకరిస్తే.. మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి (AICC National Vice President) పదవిని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టేందుకు సోనియాగాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఆలోచించి నిర్ణయం చెప్తానని మమత స్పష్టం చేయగా, మరోవైపు అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయి విలీన విధివిధానాలపై చర్చలు జరిపారు.
28 ఏళ్ల తర్వాత సొంత గూటికి – బెంగాల్ నేతల్లో అసంతృప్తి
ఒకవేళ మమతా బెనర్జీ ఈ చారిత్రాత్మక ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె తిరిగి తన సొంత గూటికి చేరినట్లవుతుంది. గత 1998 లో కాంగ్రెస్‌తో విభేదించి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన మమత, వరుసగా మూడు సార్లు బెంగాల్ సీఎంగా అఖండ విజయాలు సాధించారు. అయితే, ఈ విలీన వార్తలపై బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్నాళ్లూ తమను వేధించిన అక్రమార్కుల పార్టీని కాంగ్రెస్‌లో ఎలా కలుపుకుంటారని అధిష్ఠానాన్ని నిలదీస్తున్నారు.
ఈ పరిణామాలపై చర్చించేందుకు గురువారం బెంగాల్ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి సుకాంత్ మజుందార్ స్పందిస్తూ.. “నాలుగు గోడల మధ్య జరిగిన చర్చలపై మాట్లాడను కానీ, మమత తిరిగి వస్తే కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి” అని వ్యాఖ్యానించారు.
విలీనం కుదరదన్న తిరుగుబాటు వర్గం
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం సాధ్యం కాదని తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత రితబ్రత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. పార్టీ అధిష్ఠానం ఒంటెద్దు పోకడలు నచ్చకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తన వెంట వచ్చారని, కాంగ్రెస్‌లో విలీనం కావడానికి తమలో ఎవరూ సిద్ధంగా లేరని, తామే అసలైన అధికారిక వర్గంగా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ ఇస్తామని స్పష్టం చేశారు.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన మరో నేత రిజు దత్తా స్పందిస్తూ.. “80 మంది ఎమ్మెల్యేలలో 64 మంది, 20 మందికి పైగా ఎంపీలు మా వైపు ఉంటే.. ఇక ఎవరు ఎవరిలో విలీనం అవుతారు?” అంటూ మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఎద్దేవా చేశారు. ఏదేమైనా ఈ విలీన పరిణామం బెంగాల్‌తో పాటు జాతీయ రాజకీయాల భవిష్యత్తును మార్చేలా కనిపిస్తోంది.





































