మెట్రో విస్తరణలో పూర్తిగా విఫలం.. రేవంత్‌ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు

BRS Working President KTR Alleges Revanth Govt Failed in Hyderabad Metro Rail Expansion

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు, అనుమతులు రాబట్టడంలో అట్టర్‌ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను సైతం ఆగం చేస్తున్నందుకు సీఎం రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో వైఫల్యం

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా తెలంగాణ ప్రయోజనాల కోసం సాధించింది ఏమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

ఓటుకు నోటు కేసు భయంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గానీ ప్రశ్నించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అందుకే ఈ లోపాయికారీ ఒప్పందాల వల్ల ఢిల్లీ పర్యటనలు ఫలితాన్ని ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రాన్ని నిలదీయలేక ప్రతిపక్ష భారాసపై నిందలు వేయడం చౌకబారు వ్యూహమని మండిపడ్డారు.

మెట్రో విజయాల క్రెడిట్ కేసీఆర్‌దే

నాడు కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మెట్రో పనులు కేవలం 28 శాతం లోపే జరిగి ప్రాజెక్టు తీవ్ర చిక్కుల్లో పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. 2014లో భారాస అధికారంలోకి వచ్చిన తర్వాతే కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని మిగిలిన 72 శాతం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారని స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకపోయినా సొంతంగా రుణాలు సాధించి మూడేళ్లలోనే మెట్రోను పరుగులు పెట్టించామన్నారు.

నేడు నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణిస్తున్నారంటే అది ముమ్మాటికీ గత భారాస ప్రభుత్వ సమర్థతేనని పేర్కొన్నారు. నగర విస్తరణ, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా తాము శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కారిడార్‌తో కలిపి 76.4 కిలోమీటర్ల మేర రెండో దశను ప్రతిపాదిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ ప్రాజెక్టును రద్దు చేసి హైదరాబాద్ ప్రజలకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మాణ సంస్థపై బెదిరింపులు, ఆస్తుల కొల్లగొట్టే కుట్ర

ప్రజలకు ఉపయోగపడే రూట్లను పక్కనబెట్టి, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉనికిలోనే లేని ఒక ఊహాజనిత నగరానికి (ఫ్యూచర్ సిటీ) మెట్రో లైన్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ (L&T)ని ప్రభుత్వం తీవ్రంగా బెదిరిస్తోందని, నగర నడిబొడ్డున ఉన్న రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను, భూములను కొల్లగొట్టాలనే కుట్రతోనే ఆ సంస్థను ఇక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ బెదిరింపుల కారణంగానే సదరు సంస్థ వెనకడుగు వేస్తోందని, ఇది రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలయాపన మానాలని, హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలను పణంగా పెట్టకుండా మెట్రో రెండో దశపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here