ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తాజాగా ఆన్‌లైన్ ద్వారా పీసీసీ నిర్వహించిన జూమ్ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనుమానాస్పదం పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో మెజారిటీ శాతాన్ని ఏదో ఒక కారణంతో పక్కన పెట్టారని, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఓట్లను తొలగిస్తే రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలకు ఈ అక్టోబర్‌లోనే ఓటర్ల జాబితా ఖరారవుతుందని, ఓట్లు తొలగిపోతే తర్వాత చేసేదేమీ ఉండదని, అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా పర్యవేక్షణ, బాధ్యతలు
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోని ప్రతి పోలింగ్ బూత్ ఏజెంట్లతో కాంగ్రెస్ ముఖ్య నాయకులు నిరంతరం అనుసంధానమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామంలో తాత్కాలికంగా ఉండలేదనే కారణంతో వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుండి తొలగించకుండా ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని సూచించారు.
ఈ నెల 20వ తేదీలోగా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ ఇన్‌ఛార్జులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని గడువు విధించారు. జిల్లా స్థాయిలో పటిష్టమైన సమన్వయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, 17 ఎంపీ స్థానాల్లో ఎక్కడైనా సమస్య వస్తే పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, అలాగే అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
గాంధీభవన్‌లో వార్ రూమ్, క్షేత్రస్థాయి నివేదికలు
ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పార్టీ పరంగా చాలా సీరియస్‌గా తీసుకోవాలని, గాంధీభవన్‌లో ప్రత్యేకంగా ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల స్థాయిలో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయి నుంచి ఏ రోజుకారోజు నివేదికలను తెప్పించుకోవాలని, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా పార్టీకి భారీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సర్‌లో ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్లే అక్కడి అధికార పార్టీ ఓటమి పాలైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
పేదలు, నిరక్షరాస్యులపైనే ఎక్కువ ప్రభావం
ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలు, తప్పులతో కూడిన ఎనామిలస్ జాబితాలోని ఓటర్ల విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, సరైన ధ్రువపత్రాలను సేకరించి సకాలంలో అధికారులకు సమర్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు.
ఓట్ల తొలగింపు ప్రక్రియ వల్ల ప్రధానంగా నిరక్షరాస్యులు, పేదవారే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్‌వోలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు వలస కార్మికులు అందుబాటులో ఉండరని, అలాంటి సమయాల్లో స్థానిక నాయకత్వం చొరవ తీసుకుని వారి ఓటు హక్కును కాపాడాలని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు.



































