నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR Review Meeting, Irrigation Projects Of Telangana, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana CM KCR Latest News, Telangana Irrigation Projects, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 5, గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం వద్ద అటు జలవిద్యుత్ ఉత్పత్తికి, ఇటు గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడే విధంగా బ్యారేజి నిర్మించనున్నట్లు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కోరారు. ఈ రెండు పనులకు వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవాలని ఆదేశించారు. వీటితో పాటు మల్లన్న సాగర్ కు రెండో టిఎంసి తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను కోరారు. కంతనపల్లి బ్యారేజి పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్ కో – ట్రాన్స్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇఎన్సిలు మురళీధర్ రావు, హరిరామ్, వెంకటేశ్వర్లు, బి.నాగేంద్ర రావు, సిఇలు, ఎస్ఇలు, జెన్ కో డైరెక్టర్ వెంకట్రాజం, ట్రాన్స్ కో డైరెక్టర్లు సూర్య ప్రకాశ్, శ్రీ నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, వెంకట్రామారావు, ఇంద్రసేనారెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయాలి

దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉంది. 150 రోజుల పాటు నీటి ప్రవాహం ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఈ సానుకూలతల నేపథ్యంలో 37 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా బ్యారేజి, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. వీలైనంత తక్కువ భూ సేకరణతో, నదిలోనే నీళ్లు ఆగేలా బ్యారేజికి డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు పిలవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరుకు ప్రస్తుతం రెండు టిఎంసిల నీటిని పంపు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయాలని సీఎం నిర్ణయించారు. మిడ్ మానేరుకు మూడు టిఎంసిలు లిఫ్టు చేసి, అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు రెండు టిఎంసిలను లిఫ్టు చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పనులకు కూడా ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. దుమ్ముగూడెం బ్యారేజి, మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే పనులకు మొత్తం రూ.13,500 నుంచి రూ.14,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు సంబంధించి ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానం కోసం వర్క్ షాపు

మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ అంతే ఒకటే విభాగంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్ కు ఒక్కో ఇఎన్సి ఇంచార్జిగా వ్యవహరించి, తన పరిధిలోని నీటి పారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని ఖరారు చేయాలని చెప్పారు. ఈ వర్కు షాపులోనే రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టులు, చెరువులకు సంబంధించిన అన్ని వివరాలలతో సమగ్రమైన జాబితా తయారు చేయాలని సీఎం కోరారు. అన్ని ప్రాజెక్టులు, పంపుహౌజులు, లిఫ్టులు, కాల్వలు, చెరువుల నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మ్యాన్యువల్స్ అదే వర్కుషాపులో ఖరారు చేయాలని సీఎం చెప్పారు. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టిఎంసిలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద అదనంగా ఇంపెల్లర్స్, పంపుసెట్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లను ఉంచాలని సీఎం కేసీఆర్ కోరారు. నీటి పారుదల విధానం, ఇన్వెంటరీ, నిర్వహణ వ్యూహం ఖరారు అయిన తర్వాత, రాష్ట్ర స్థాయి నీటి పారుదల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.

నాగార్జున సాగర్ ఆయకట్టు కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక

కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీళ్లు వస్తాయి కాబట్టి పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్ పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నహర్ కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ ఆన్ లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవుల పల్లి రిజర్వాయర్ కు నీటిని చేర్చాలని సీఎం చెప్పారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించాలని చెప్పారు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డు ఇంజనీర్లు త్వరలోనే ఈ ప్రాంతాల్లో పరిశీలించాలని కోరారు. గోదావరి బేసిన్ లో మల్లన్న సాగర్ వద్ద, కృష్ణా బేసిన్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =