తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’, రైతులు కాస్త ధైర్యంగా ఉండాలి – సీఎం కేసీఆర్

CM KCR Visited Lakshmipur Village Of Karimnagar District And Inspects Crops Damaged By The Untimely Rains Hail Strom,CM KCR Visited Lakshmipur Village,CM KCR Inspects Karimnagar District Crops Damaged,Karimnagar Crops Damaged By The Untimely Rains Hail Strom,Mango News,Mango News Telugu,Karimnagar District Officials Revealed CM,CM KCR Visits For Assessment Of Crop Damage,CM KCR Namasthe Telangana Today,Telangana CM To Inspect Areas Hit By Untimely Rains,Karimnagar Latest News

రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలనీ, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. గురువారం వరంగల్ జిల్లా పర్యటన అనంతరం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ కు సీఎం చేరుకున్నారు. అనంతరం సమీపంలోని మస్క్ మిలన్ పంట సాగుచేస్తున్న దేవరాంచంద్రా రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటను పరిశీలించారు. తర్వాత దెబ్బతిన్న డ్రాగన్ ఫ్రూట్ పంటను కూడా పరిశీలించి సాగు విస్తీర్ణం, పంట నష్టం వివరాలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా రైతు రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ, గతంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పది పదిహేను బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందనీ, స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత 8 నుంచి 10 మీటర్ల లోపే బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తున్నదనీ, కరెంటు విషయంలో ఎలాంటి సమస్యా లేదని సీఎం దృష్టికి తెచ్చారు. అటు తర్వాత పక్కనే ఉన్న పొట్టకొచ్చిన వరి పంటను సీఎం పరిశీలించారు. సాగు పద్ధతులు, పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు “మీరే సార్ మా రైతుల ధైర్యం, దయచేసి మమ్మల్ని ఆదుకోండి” అంటూ సీఎంకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం సీఎం సమీపంలోని మామిడి రైతు ఎడవెల్లి రాజిరెడ్డి మామిడి తోటకు చేరుకొని, వడగండ్ల వానకు రాలిపోయిన మామిడి కాయలను చేతబట్టుకొని పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. పెట్టిన పెట్టుబడి, పంట నష్టం వివరాలను ఆరా తీశారు. ఎరువుల వాడకం, సేద్యం తీరుతెన్నులను గురించి కాసేపు రైతులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను, కౌలు దారులను సమన్వయపరిచి నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లను రైతుల సమక్షంలోనే సీఎం ఆదేశించారు. అటు తర్వాత రామడుగు రైతు వేదిక క్లస్టర్ కు చేరుకొని మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ అనంతరం హెలిప్యాడ్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం మీద 2,28,258 ఎకరాలు దెబ్బతిన్నట్లుగా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన రిపోర్టు ప్రకారం తెలుస్తున్నది. మొక్కజొన్ననే ఎక్కువగా దెబ్బతిన్నది. 1,29,446 ఎకరాల మొక్కజొన్న, 72,709 ఎకరాలు వరిచేలు, 8,865 ఎకరాలు మామిడితోటలు, పుచ్చకాయ, తర్బూజ, టమాటలు, వంకాయలు, రకరకాల కూరగాయలు, పంటలన్నీ కలిపి 17, 238 ఎకరాలు మొత్తం దెబ్బతిన్నట్లుగా తెలుస్తా ఉన్నది. బీభత్సమైన వర్షం పడ్డది. నర్సంపేట ప్రాంతంలో చెట్టుకు కాయ కూడా లేదు. వంద శాతం పంట దెబ్బతిన్నది. నష్టం ఎక్కువ జరిగింది. తెలంగాణలో గతంలో చొప్పదండి, నర్సంపేట తదితర ప్రాంతాల్లో రైతాంగం కకావికలై చెట్టుకొకరు, గుట్టకొకరు చెదిరిపోయిన పరిస్థితి ఉండేది. సమైక్య పాలనలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. చొప్పదండి కూడా చాలా కరువు ప్రాంతంగా, భయంకర ఎడారి ప్రాంతంగా ఉండేది. చాలా నైపుణ్యంతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుంటే కొంతమంది రాజకీయ అజ్నానులు మూర్ఖంగా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును పూర్తిచేసుకున్నాం. ఈరోజు భారత దేశం మొత్తం కలిపితే ఉండే వరి చేలు కంటే ఎక్కువగా తెలంగాణలోనే పండుతున్నది. ఇవ్వాల తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో వరిచేన్లు ఉన్నయ్. దాదాపు 20, 22 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు కూడా ఉన్నయ్. రకరకాల ఇతర పంటలతో 84 లక్షల ఎకరాలు రెండవ పంటలో సాగులో ఉంది. ఇలా ఇండియాలో ఎక్కడా వ్యవసాయం లేదు. చెట్టుకొకలు పుట్టకొకలు అయిన రైతాంగాన్ని, వలసబోయిన మళ్లీ వెనక్కి రప్పించి వ్యవసాయాన్ని నిలబెట్టి బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నం” అని అన్నారు.

“ఎవరెన్ని విమర్శలు చేసినా రైతులోకాన్ని, రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నుంచి ఉచిత సాగునీరును దేశంలో ఎక్కడాలేని విధంగా అందిస్తున్నాం. పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసినం. చిల్లరమల్లర సమస్యలూ లేకుండా చేసినం. ఎత్తు భాగాల్లో ఉండే పొలాల్లో పండించుకునే అవకాశం ఏర్పడింది. గతంలో ఇలాంటి పచ్చని పంట పొలాలు కనిపించేవి కావు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక రిజర్వాయర్ అయింది కాబట్టి భూగర్భ జలాలు పెరిగాయని, అద్భుతంగా మేము పంటలు పండించుకుంటున్నామని రైతులు చెబుతా ఉన్నరు. నాలుగైదేండ్ల నుంచి నాకు మంచి పంటలు వచ్చి, మంచి లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు. దురదృష్టవశాత్తూ ఈ ఒక్కసారి నాకు నష్టం వచ్చినా సరే తట్టుకుంటా అని ఒక రైతు చెబితే నాకూ చాలా సంతోషమైంది. గుండె ధైర్యమనిపించింది. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ఎకరాకు రూ.10 వేలు ప్రకటించినం. కేంద్రానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే తీరుగ ఉన్నది. వాళ్లకు చెప్పీ చెప్పీ దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు..వాళ్లు బృందాలొచ్చుడు, తిరుగుడు, డ్రామాలు కొట్టుడు తప్ప ఇచ్చేది లేదు. కేంద్రాన్ని అడగను కూడా అడగదలుచుకోలేదు. వాళ్లకు చెప్పినా అర్థం కాదు. కనీసం సమస్యను అర్థం చేసుకొనే సంస్కారం కూడా లేదు. ఇప్పటివరకూ ఎన్నిసార్లడిగినా ఇవ్వలేదు. హైదరాబాద్ వరదలొచ్చినా ఇవ్వలేదు. ఇంక కూడా ఈ ఉపద్రవం జరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేని వసతులను తెలంగాణ రైతాంగానికి చేకూర్చి వారిని కడుపులో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నతస్థితికి తీసుకొని పోగలిగాం. మన రాష్ట్ర జీడీపీ పెరిగింది. ఆదాయం కూడా పెరుగుతున్నది. ప్రజలకు పనిదొరికి, పల్లెలన్నీ సుఖ సంతోషాలతో విలసిల్లుతూ ఉన్నయ్. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు. మీ వెంట కేసీఆర్ ఉంటడు . రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఉండాలె తప్ప మనసు చిన్నబుచ్చుకొని నారాజ్ కావొద్దు. ఇంకా బలంగా పనిచేస్తా ఉండాలె. సీఎస్ జీవో కూడా ఇచ్చారు. తొందర్లోనే డబ్బులు కూడా వస్తయి. కౌలు రైతులు కూడా మునిగిపోకుండా ఆదుకోవాలని కలెక్టర్లకు చెప్పాం. సీఎస్ ఆదేశాల ప్రకారం వారినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. రైతాంగం డిజార్డర్ కావొద్దు. నీరుకారిపోవద్దనే సదుద్దేశంతోనే ఇటువంటి సాయం చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో సంతరించుకోబడ్డ స్థితి ముందుకే వెళ్లాలనే సదుద్దేశంతోనే ముందుకు పోతున్నం. రైతాంగం ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని రైతులోకం ముందుకొచ్చి ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రైతుబంధు సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, జడ్పీ ఛైర్మన్ కనుమళ్ళ విజయ, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ జివి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, సింగిల్ విండో ఛైర్మన్ వీర్ల వేంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 7 =