తెలంగాణకు ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు చేస్తుంది: మంత్రి కేటీఆర్

Minister KTR Says Centre has One Rule for Gujarat and Another for Telangana Expresses Ire Against Auction of Singareni Coal Mines,Central Govt Conspire Remove Singareni,Telangna Minister Ktr,Minister Ktr On Singareni,Mango News,Mango News Telugu,Singareni Coal Mines,Singareni Collieries,Singareni Coal Mines Kothagudem,Singareni Coal Mines Map,Sccl Mines List,List Of Coal Mines In Telangana,Singareni Coal Mines District,The Singareni Collieries Company Ltd,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తక్కువ కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తూ, అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణపై కక్ష కట్టి, ఢిల్లీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఎన్నో రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ చెపుతున్నట్టుగానే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తాజాగా పార్లమెంటులో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు చేసిన ప్రకటనపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా అనేక సార్లు వ్యాఖ్యలు చేయడం, అన్ని రంగాలను తెలంగాణను దెబ్బతీసే ప్రయత్నాన్ని కేంద్రం కొనసాగిస్తోందని కేటీఆర్ చెప్పారు.

కేంద్రం గుజరాత్ కు ఒక న్యాయం తెలంగాణలోని సింగరేణికి ఇంకొక న్యాయం:

అయితే సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన అన్ని అడ్డంకులను దాటుకొని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణని దెబ్బతీసేందుకు దొడ్డి దారిన కేంద్రం కుట్రలు చేస్తుందని కేటీఆర్ విమర్శించారు.అందులో భాగంగానే తెలంగాణ కొంగు బంగారం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆయువుపట్టు అయిన సింగరేణి ని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మాత్రం నామినేషన్ పద్ధతిన గుజరాత్ లో భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సైతం బొగ్గు గనులను కేటాయించాలని అనేక రోజులుగా తమ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. ఎప్పటి మాదిరే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజరాత్ కు ఒక న్యాయం తెలంగాణలోని సింగరేణి కి ఇంకొక న్యాయం అన్నట్లుగా పక్షపాతంతో వ్యవహరిస్తూ తీరని అన్యాయం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ప్రభుత్వం అప్పజెప్పిన గనుల కేటాయింపు మరియు వాటి పర్యావరణ అనుమతులు ప్రక్రియ తాలూకు పత్రాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రధానమంత్రిగా పదవి పీఠంపై కూర్చోగానే గుజరాత్ పై పక్షపాతంతో 2014 ఆగస్టులోనే లిగ్నైట్ గనులను గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆ తరువాతి సంవత్సరం జూలై 27వ తేదీనే కేంద్రం, లిగ్నైట్ బొగ్గు గనులను గుజరాత్ సంస్థకి కేటాయించారు. దాంతోపాటు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన పర్యావరణ అనుమతులు తాలుకు 2018 పత్రాలను సైతం కేటీఆర్ విడుదల చేశారు.

తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు?:

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్రాన్ని కోరినా పెడచెవిన పెట్టిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత రాష్ట్రం కోసం తమ వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధానమంత్రి తెలంగాణ సమాజంపై జేలసీ(ఈర్ష్య)తో సింగరేణి గనులకు వేలం వేస్తున్నారన్నారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ప్రజలను నమ్మబలికించే ప్రయత్నం చేశారని కానీ, ఇప్పుడు సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలానికి పెట్టడం వారి ద్వంద ప్రమాణాలకు, భూటకపు మాటలకు అద్దం పడుతుందన్నారు. కేవలం నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతామంటూ కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం, ఉత్పత్తి మరియు లాభాల్లో ప్రతీ సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తూ, తాజాగా దేశంలోనే అత్యధికంగా పిఎల్ఎఫ్ సాధించిన సింగరేణిని దెబ్బకొట్టే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందన్నారు. బొగ్గు తవ్వకమే సింగరేణికి ప్రధాన విధి అని, అలాంటి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పాట పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేస్తుందన్నారు.

బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే:

ఇలా వేలంపాట ద్వారా బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, అమ్మకానికి పెట్టినట్లుగానే సింగరేణిని కూడా అంతిమంగా తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పే కుట్రలను కేంద్రం చేస్తుందన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, అయినా కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతుందన్నారు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులన్నింటిని ప్రవేట్ కి అప్పజెప్పితే మరి సింగరేణి కాలరీస్ సంస్థ చేయాల్సిన పని ఇంకేం మిగిలి ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం సింగరేణి విస్తరించిన ఏడేనిమిది జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్ర అని కేటీఆర్ చెప్పారు. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించి తెలంగాణ రైతన్నలకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేసేందుకు కుట్రలకు తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణను విద్యుత్ రంగంలో దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర:

తెలంగాణ రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్ లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని, అలాంటి సింగరేణిని ప్రైవేటీకరిస్తే కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటల పాటు ఇస్తున్న విద్యుత్ సరఫరాను దెబ్బతీయచ్చన్న ఆలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ చీకట్లోకి జారుకుంటుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మరియు రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకాలపైన అక్కసుతో, ఉచితాలన్ని అనుచితాలే అంటూ స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చిన ప్రకటనల నేపథ్యంలోనే కేంద్రం బలవంతంగా ప్రజలకు ఉచిత విద్యుత్తును దూరం చేసేలా రూపొందించిన నూతన విద్యుత్ సంస్కరణల కుట్రలను తెలంగాణ బలంగా అడ్డుకుంటున్నదని, అందుకే పరోక్షంగా తెలంగాణను విద్యుత్ రంగంలో దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో కేంద్రం విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందని, సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దు అవుతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతామం:

150 సంవత్సరాలకుపైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమెసే కుట్రలు ఇకనైనా ఆపాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ ద్వారా సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందని, ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి అండగా ఉంటున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా గనుల వేలం పైన ముందుకు వెళితే టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం సింగరేణి నుంచి ఉవ్వెత్తున ఎగిసినట్లుగానే, మరోసారి కేంద్రానికి వ్యతిరేకంగా సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. సింగరేణి మెడపై కేంద్రం ప్రైవేట్ కత్తి పెడితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు వేటు వేయడం ఖాయమన్నారు. సింగరేణి భుజంపై నుంచి తెలంగాణ ప్రజలపై గన్ను పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరుని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలని, తెలంగాణ ప్రజల పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తమ ఎంపీలు బొగ్గు గనుల వేలం అంశం పై పార్లమెంటులో నిలదీస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడిపై దెబ్బ కొట్టాలని చూస్తున్న కేంద్రం కుట్రలపై పోరాడేందుకు కలిసి రావాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =