సంవత్సరం పొడవునా చేపలవేట నిర్వహించేలా చర్యలు, 200 క్లస్టర్ల ఏర్పాటు : మంత్రి తలసాని

200 clusters to export Telangana fish, Be cautious on fish seed purchase, Fisheries Department Officials, Mango News, Minister Srinivas Yadav Held Review Meeting with Fisheries Department, Minister Srinivas Yadav Held Review Meeting with Fisheries Department Officials, Minister Srinivas Yadav Review Meeting, Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav Review Meeting on Fisheries Department, Review Meeting with Fisheries Department Officials, State plans to market export fish with private partners, Telangana Fisheries Department, Telangana Fisheries Department News

తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతుల ప్రక్రియను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి ఘణనీయంగా పెరిగిందని అన్నారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, 2020-21 సంవత్సరంలో 3.49 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపలలో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా, 21 శాతం పశ్చిమ బెంగాల్, మిగిలిన 19 శాతం చేపలను అస్సాం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని వివరించారు.

రాష్ట్రం మొత్తం సుమారు 200 వరకు క్లస్టర్ లను ఏర్పాటు చేసేందుకు పరిశీలన:

మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. కానీ మత్స్యకారులు మద్యదళారులకు తక్కువ ధరలకు చేపలను విక్రయించుకొని నష్టపోతున్నారని, వారికి ఆర్ధికంగా లబ్ది చేకూర్చే ఉద్దేశంతో మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేరుగా మత్స్యకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ చేపలు బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపర్చడంలో భాగంగా మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. మత్స్య సొసైటీల నుండి కొనుగోలు చేసిన చేపలను 2 లేదా 3 మండలాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి అక్కడికి రవాణా చేయాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రం మొత్తం సుమారు 200 వరకు క్లస్టర్ లను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. 40 నుండి 50 క్లస్టర్ లకు ఒక ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుసంధానం చేయడం జరుగుతుంది. మొదటగా హైదరాబాద్ లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లలో ఉన్న మత్స్య శాఖ కు చెందిన భూములలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ లలో క్లస్టర్ ల నుండి వచ్చిన చేపలను గ్రేడింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, శుద్ధి చేయడం, ఫిష్ ఔట్ లెట్ లకు సరఫరా చేయడం, ఇతర మార్కెట్ లకు సరఫరా చేయడం లేదా ఇతర రాష్ట్రాలకు పంపించడం వంటి వంటి ప్రక్రియలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

సంవత్సరం పొడవునా చేపల వేట నిర్వహించేలా చర్యలు:

పెరిగిన మత్స్య సంపదకు అనుగుణంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో (ఫ్రాంచైజ్) మరిన్ని కొత్త ఫిష్ ఔట్ లెట్ లను ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో తలసరి చేపల వినియోగం సాలీనా 7.88 కిలోలు ఉన్నది. కాని ఐసీఏంఆర్ సిపారసు ప్రకారం 12 కిలోలు తీసుకోవాలి. రాష్ట్రంలో కావలసినంతగా చేపల లభ్యత ఉన్నప్పటికీ వినియోగదారులకు చేపలను అందించలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలో మంచినీటి వనరులు విస్తారంగా ఉన్నాయని, 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని చెప్పారు. మత్స్యకారులు కేవలం వేసవి కాలంలో మాత్రమే చేపల వేటను కొనసాగిస్తున్నారని, సంవత్సరం పొడవునా చేపల వేట నిర్వహించేలా మరియు పట్టిన చేపలు పరిశుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను ఆదేశించారు. మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపట్టబోయే మార్కెటింగ్ వలన సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి మరియు సుమారు 5 వేల మంది వరకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రంగంలో అనుభవం కలిగి ఉన్న అందరితో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధిస్తున్నారని, జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని అన్నారు. ఇందుకోసం పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 1 =