రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజానికి మోదీ క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి తెలంగాణ అంటే ఒకరకమైన వ్యతిరేక భావన ఉందని.. ఆయన మాటల్లోనే తెలుస్తోందని రేవంత్ అన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని ఇలా మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి, ఏపీలో అధికారంలోకి రాకపోయినా పర్వాలేదని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ తెలిపారు.
ప్రధాని మోదీకి పార్లమెంటులో బిల్లు ఓటింగ్‌కు వచ్చే సమయంలో తీసుకునే నిర్ణయాల పట్ల కనీస అవగాహన కూడా లేదు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ అవసరం లేదని అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. 1999లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి నాలుగు స్థానాల్లో విజయం అందిస్తే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. అప్పుడు తెలంగాణ ఇవ్వకపోవడం వలనే తర్వాత జరిగిన ఉద్యమంలో 1200 మంది అమాయకులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ