కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్ అమలు అంశాలపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 22, బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతి కుమారి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జరిపిన పరీక్షల్లో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలిందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలున్నాయన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. అనంతరం వారు నేరుగా ప్రగతి భవన్ చేరుకుని సీఎంకి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ సహా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. గాంధీ ఆసుపత్రిలో అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
‘‘రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించాం. వారి ద్వారా ఎవరెవరికి వైరస్ సోకే అవకాశం ఉందో కాంటాక్టు లిస్టు తయారు చేసి పరీక్షలు జరిపాం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వారున్నారో ఒక అంచనా దొరికింది. దీని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాం. అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాం. కాంటాక్టు వ్యక్తులందరనీ క్వారంటైన్ చేశాం. దీని కారణంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగాం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదే విధంగా సహకరించి లాక్డౌన్ నిబంధనలను, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu