రాజ్యసభలో గందరగోళం.. క్షమాపణకు పట్టుబట్టిన బీజేపీ, చెప్పనన్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్‌ ఖర్గే

Parliament Winter Session BJP Demands Congress Chief Mallikarjun Kharge's Apology Over His Remarks But He Refuses,Parliament Winter Session,BJP Demands Apology,Congress Chief Mallikarjun Kharge,Mango News,Mango News Telugu,Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, INC Latest News and Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress president Mallikarjun Kharge,Parliament Winter Session,Parliament Winter Session Skip,Parliament Winter Session Rahul Gandhi

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం చేసిన కొన్ని పరుష వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండిపడింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ పట్టుబట్టడంతో సభ స్తంభించింది. అయితే మల్లిఖార్జున్‌ ఖర్గే అందుకు నిరాకరించడంతో బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, సభలో జరుగుతున్న దానిని చూసి బయట 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారని మండిపడ్డారు.

కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ను ఉద్దేశించి బీజేపీ ‘భారత్ తోడో (భారత్‌ను విభజించండి) యాత్ర’గా అభివర్ణించిన నేపథ్యంలో ఖర్గే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మల్లిఖార్జున్‌ ఖర్గే రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో సోమవారం జరిగిన భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటంలో కాంగ్రెస్ ఎన్నో ప్రాణ త్యాగాలు చేసిందని, అయితే బీజేపీ మాత్రం కనీసం ఒక్క శునకాన్నికూడా కోల్పోలేదని అన్నారు. బీజేపీ నేతలు మాటలు మాత్రం సింహంలా ఉంటాయని, కానీ ప్రవర్తన మాత్రం చిట్టెలుక లాగా ఉంటుందని ఎద్దేవా చేశారు.

దేశ సరిహద్దుల్లో దురాక్రమణలకు పాల్పడుతున్న చైనాపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం భయపడుతోందని, దీనిపై పార్లమెంటులో కనీసం చర్చ కూడా చేపట్టకుండా పలాయనం చిత్తగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. కానీ తొలినుంచీ దేశం కోసం కాంగ్రెస్ నిలబడిందని, ఈ క్రమంలో స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారని, ఆ తర్వాత కూడా దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ వంటి నేతలు తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. అయితే బీజేపీ నేతలెవరూ దేశం కోసం ప్రణాలివ్వలేదని, కనీసం వారి ఇళ్లలోని ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని వ్యాఖ్యానించారు. అయినా సరే తామే దేశభక్తులమని గొప్పలు చెబుతుంటారని, త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీపై, నేతలపై దేశద్రోహులుగా ముద్ర వేస్తారని ఖర్గే మండిపడ్డారు.

ఇక మల్లిఖార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలు, నేడు సభలో తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో మాట్లాడుతూ.. అల్వార్‌లో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఖర్గే క్షమాపణ చెప్పాలని అన్నారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఆయన అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణ చెప్పేది లేదంటూ ఖర్గే స్పష్టం చేశారు. తాను సభలో చేయని వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 12 =