40 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షాక్ చేసిన కాబో వెర్డ్‌ కీపర్ వోజిన్హా

Cape Verde Goalkeeper 40-Year-Old Vozinha Becomes Overnight Star After Heroic World Cup Debut

ఫిఫా వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీలో పసికూన కాబో వెర్డ్‌ జట్టు సంచలన ప్రదర్శనతో ఫేవరెట్ స్పెయిన్‌ను 0-0తో నిలువరించి ఫుట్ బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో కాబో వెర్డ్‌ జట్టుకు చెందిన 40 ఏళ్ల సీనియర్ గోల్‌కీపర్ జోసిమార్ జోస్ ఎవోరా డయాస్ (వోజిన్హా) అసాధారణమైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌లో తమ దేశానికి ఇదే తొలి మ్యాచ్ అయినప్పటికీ, స్పెయిన్ లాంటి బలమైన జట్టు చేసిన 27 భీకర దాడులను, లక్ష్యాలను తన అద్భుతమైన డిఫెన్స్‌తో అడ్డుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

మైదానంలో అడ్డుగోడలా నిలిచిన వోజిన్హా

మ్యాచ్ ప్రారంభం నుంచే స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లు పదేపదే కాబో వెర్డ్‌ గోల్ పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. అయితే వోజిన్హా ఒక అభేద్యమైన అడ్డుగోడలా నిలిచి స్పెయిన్ స్టార్ ఆటగాళ్లు ఫెర్రాన్ టోరెస్, ఐమరిక్ లాపోర్టే, మైకెల్ ఓయర్జబల్ కొట్టిన ప్రమాదకరమైన షాట్లను అద్భుతమైన డైవ్‌లతో ఆపాడు. ద్వితీయార్థంలో స్పెయిన్ తన స్టార్ ఆటగాడు లామిన్ యమల్‌ను రంగంలోకి దించినప్పటికీ వోజిన్హా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు.

మొత్తం 7 అత్యంత క్లిష్టమైన సేవ్‌లతో పాటు స్పెయిన్ చేసిన ప్రతీ దాడిని తిప్పికొడుతూ ఆయన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్ల సంఖ్య కేవలం 24 గంటల్లోనే 50 వేల నుండి ఏకంగా కోటికి పైగా పెరగడం విశేషం.

వీసా సమస్యలు.. కన్నీరు పెట్టుకున్న వోజిన్హా

మ్యాచ్ ముగిసిన వెంటనే తుది విజిల్ పడగానే వోజిన్హా మైదానంలోనే మోకాళ్లపై కూర్చుని ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం దీనిపై ఆయన స్పందిస్తూ, తన జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి తన తల్లి రాలేకపోయిందనే బాధతో తాను ఏడ్చానని వెల్లడించాడు.

అమెరికా వీసా ప్రక్రియలో ఎదురైన జాప్యం, అలాగే భారీ విసా ఫీజులు మరియు బాండ్ల ఖర్చుల కారణంగా ఆమె సమయానికి ఇక్కడికి చేరుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి పెంచిన తల్లి, అలాగే కొన్నేళ్ల క్రితం మరణించిన తన అమ్మమ్మ ఈ చారిత్రాత్మక క్షణంలో తన పక్కన లేకపోవడాన్ని ఆయన గుర్తుచేసుకున్నాడు.

సినిమా కథను తలపించే జీవిత కథ

ఫిఫా ప్రపంచకప్ 2026 వేదికపై స్పెయిన్ లాంటి అగ్రశ్రేణి జట్టును ఒంటిచేత్తో అడ్డుకుని, రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాబో వెర్డ్‌ గోల్‌కీపర్ వోజిన్హా (జోసిమార్ జోస్ ఎవోరా డయాస్) జీవితం ఒక సినిమా కథను తలపిస్తుంది. మైదానంలో ఆయన చూపిన అసాధారణ ప్రతిభ వెనుక ఎన్నో ఏళ్ల పేదరికం, అవమానాలు, కఠిన శ్రమ దాగి ఉన్నాయి. 40 ఏళ్ల వయసులో ప్రపంచకప్ అరంగేట్రం చేసిన ఈ రియల్ హీరో వ్యక్తిగత జీవితం మరియు ఆయన ఎదుర్కొన్న సవాళ్ల వివరాలు ఇవే..

ప్రస్తుతం పోర్చుగల్ సెకండ్ డివిజన్ క్లబ్ చావ్స్‌కు ఆడుతున్న వోజిన్హా, 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించలేదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లను దాటుకుంటూ 40 ఏళ్ల వయసులో ప్రపంచకప్ వేదికపై తన కలని నిజం చేసుకున్న ఈ అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

అమ్మమ్మచాటు బిడ్డ.. అవమానమే పేరుగా మారింది!

వోజిన్హా కాబో వెర్డ్‌లోని మిండెలో అనే తీరప్రాంత నగరంలో జన్మించాడు. తండ్రి మిలిటరీలో పనిచేయడం, తల్లి రోజంతా కష్టపడి పనిచేయాల్సి రావడంతో ఆయన చిన్నతనమంతా అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలోనే గడిచింది. చిన్నప్పుడు వీధుల్లో తనకంటే వయసులో పెద్దవారితో ఆయన ఫుట్‌బాల్ ఆడేవారు. ఆటలో పెద్ద పిల్లలు ఆయనను కిందపడేసి కొడుతుంటే, కోపంతో, ఏడుస్తూ ఇంటికి పారిపోయి అమ్మమ్మకు చెప్పుకునేవాడు.

దాంతో తోటి పిల్లలంతా ఆయనను ఎగతాళి చేస్తూ.. పోర్చుగీస్ భాషలో ‘అమ్మమ్మ చాటు బుజ్జాయి’ అని అర్థం వచ్చేలా ‘వోజిన్హా’ అని పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు అవమానంగా అనిపించిన ఆ పేరే, కాలక్రమేణా ఆయన అసలు పేరును మార్చేసి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే బ్రాండ్‌గా మారిపోయింది.

డ్రైవర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా బతుకు పోరాటం

చాలామంది స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు 15-18 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్లబ్‌లలో స్థానం సంపాదించుకుంటారు. కానీ వోజిన్హాకు 25 ఏళ్లు వచ్చే వరకు అసలు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడే అవకాశమే రాలేదు. కాబో వెర్డ్‌ లాంటి చిన్న దేశంలో కేవలం ఫుట్‌బాల్‌ను నమ్ముకుంటే పొట్ట గడవని పరిస్థితి. దాంతో కుటుంబ పోషణ కోసం ఆయన మైదానం వెలుపల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

పొట్టకూటి కోసం ఆయన బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. అలాగే మరికొన్నాళ్లు ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తూ లీగ్ మ్యాచులు ఆడేవాడు. రోజువారీ డ్యూటీలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి వేళల్లో, అలసిపోయిన శరీరంతోనే ప్రాక్టీస్ చేసేవాడు.

ఎన్నో తిరస్కరణలు.. మొదటి అవకాశం

గోల్‌కీపర్‌కు కనీస ఎత్తు ఉండటం చాలా అవసరం. వోజిన్హా తన ద్వీపంలోనే అత్యుత్తమ కీపర్ అయినప్పటికీ, కేవలం ఎత్తు తక్కువగా ఉన్నాడనే నెపంతో స్థానిక క్లబ్‌లు ఆయనను పదేపదే తిరస్కరించాయి. అయినప్పటికీ ఆయన పట్టుదల వీడలేదు. 2012లో (26 ఏళ్ల వయసులో) అంగోలా దేశానికి చెందిన ప్రొఫెషనల్ క్లబ్ ‘ప్రోగ్రెసో’లో ఆయనకు మొదటిసారి అవకాశం వచ్చింది.

ఆ పేరే  జెర్సీపై..

ఆ క్లబ్‌లో అప్పటికే జోసిమార్ అనే మరో కీపర్ ఉండటంతో, జెర్సీపై ‘జోసిమార్-2’ అని వేసుకోవడం ఇష్టం లేక, తన చిన్ననాటి ముద్దుపేరు ‘వోజిన్హా’నే జెర్సీపై ముద్రించుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం నైజీరియా, అంగోలా, మోల్డోవా, సైప్రస్, స్లోవేకియా మరియు పోర్చుగల్ వంటి దేశాల్లోని చిన్న చిన్న సెకండ్ డివిజన్ క్లబ్‌ల చుట్టూ ఒక యాత్రికుడిలా సాగింది.

ప్రపంచకప్‌కు ముందు క్లబ్ కూడా లేని పరిస్థితి!

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 2026 ప్రపంచకప్ ఆడటానికి అమెరికా వచ్చే సరికే వోజిన్హాకు ఏ క్లబ్ తోనూ ఒప్పందం లేదు (Free Agent). పోర్చుగల్ సెకండ్ డివిజన్ క్లబ్ ‘చావ్స్’తో ఆయనకున్న కాంట్రాక్ట్ ప్రపంచకప్‌కు కొద్దిరోజుల ముందే ముగిసిపోయింది. 40 ఏళ్ల వయసులో ఇక కెరీర్ అయిపోయిందనుకున్న దశలో, దేశం తరఫున లభించిన అతిపెద్ద అవకాశాన్ని వాడుకుని స్పెయిన్ లాంటి మహా జట్టుకు అడ్డుగోడలా నిలిచాడు.

ఎంతోమందికి స్ఫూర్తి

కన్నతల్లి అమెరికా రాలేకపోవడం, చిన్నప్పటి నుంచి ప్రాణంగా చూసుకున్న నానమ్మ, తాతయ్యలు ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూడటానికి బతికి లేకపోవడం, ఈ స్థాయికి చేరుకోవడానికి తాను పడిన కష్టాలు.. ఇలా అన్నీ ఒక్క క్షణం తన కళ్ళ ముందు కదలాడడంతో మ్యాచ్ ముగిశాక ఆయన మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. బస్సు డ్రైవర్ సీటు నుండి ప్రపంచకప్ వేదికపై ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన వోజిన్హా ప్రస్థానం, పట్టుదల ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఏ కలనైనా నిజం చేసుకోవచ్చని నిరూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here