‘టీఆర్ఎస్’ పేరు కేటాయింపు వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Delhi HC Directs EC To Hear K. Kavitha's Personal Arguments Before Final Call on TRS Name

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరు కేటాయింపు వివాదంలో ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వడానికి ఆమెకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు ఇప్పటివరకు స్పందించని కవిత, నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.

వ్యక్తిగత వాదనలు వినాలని ఈసీకి హైకోర్టు సూచన

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వారం రోజుల్లో కవిత తన రాతపూర్వక అభిప్రాయాలను తెలిపిన తర్వాత, వ్యక్తిగతంగానూ ఆమె వాదనలను (పర్సనల్ హియరింగ్) విని తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే ‘టీఆర్ఎస్’ పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్నందున, అదే పేరును కవితకు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు.

పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు

ఈ టీఆర్ఎస్ పేరు కేటాయింపుపై ఎన్నికల సంఘానికి ఇప్పటికే వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. గతంలో ఇలాంటి రాజకీయ పార్టీల పేర్ల వివాదాల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినడానికి అవకాశం ఇవ్వలేదని, అందువల్ల ఈ పేరును కేటాయించడం సాధ్యం కాదనే విషయాన్ని ఇప్పటికే కవితకు స్పష్టం చేసినట్లు తెలిపారు.

మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాత్రం టీఆర్ఎస్ పేరును ఆమెకే కేటాయించాలని కోర్టులో గట్టిగా వాదించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో కవితకు తన వాదనలు వినిపించే సరైన అవకాశం ఇవ్వకుండానే ఏకపక్షంగా ప్రతికూల నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు, కవితకు వారం రోజుల గడువు ఇస్తూ ఈసీకి తగిన మార్గదర్శకాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here