శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదనతో భారత్-అమెరికా అంతరిక్ష సహకారం మరింత బలోపేతం కానుంది.
చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ‘మూన్ బేస్’ ఏర్పాటు చేయాలని నాసా ప్రణాళికలు రూపొందిస్తోంది. వ్యోమగాములు అక్కడ నివసించడంతో పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేందుకు వీలుగా ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించాలని భావిస్తోంది. భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు అవసరమైన సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టును కీలకంగా పరిగణిస్తోంది.
బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇండియా-యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (CSJWG) 9వ సమావేశంలో మూన్ బేస్ ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఆర్టెమిస్ ఒప్పందం కింద ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని నాసా, ఇస్రో భావిస్తున్నాయి.
సమావేశంలో అంతరిక్ష శాస్త్రం, మానవసహిత అంతరిక్ష యాత్రలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంపై ఇరు సంస్థలు చర్చించాయి. అలాగే TRUST కార్యక్రమం కింద పౌర, వాణిజ్య అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపైనా దృష్టి సారించాయి.
ఈ సమావేశంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్, అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. భారత్-అమెరికా మధ్య అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సహకారం ఇరు దేశాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు కూడా కీలకంగా మారనుంది.
నాసా ఆహ్వానంతో చంద్రయాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు, గగన్‌యాన్ సహా భవిష్యత్తు మానవసహిత అంతరిక్ష యాత్రలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. సుదూర రోదసి పరిశోధనల్లో భారత్, అమెరికా కలిసి మరింత కీలక పాత్ర పోషించే దిశగా ఈ పరిణామం ముందడుగుగా భావిస్తున్నారు.









































