బీసీలకు టీడీపీ కోటా 34% కాదు.. 40 శాతం – సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

CM Chandrababu Announces, TDP Will Allocate Upto 40% Reservations For BCs in Local Elections

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (BC) అభ్యర్థులకు రాజకీయంగా మరింత పెద్దపీట వేసేలా తెలుగుదేశం పార్టీ (TDP) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం వరకు రిజర్వేషన్లు (సీట్లు) కల్పించేలా కసరత్తు చేస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల సన్నద్ధతపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఇన్‌ఛార్జులతో నిర్వహించిన ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశంలో ఆయన ఈ కీలక దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపా పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించి వారి రాజకీయ హక్కులను హరించారని చంద్రబాబు దుయ్యబట్టారు.

అంతేకాకుండా, స్థానిక ఎన్నికలు జరగకుండా, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల ద్వారా అడ్డు తగిలింది వైకాపానే అని విమర్శించారు. చట్టపరమైన అంశాలు, రిజర్వేషన్ల పరిమితులు ఎలా ఉన్నప్పటికీ, రాజకీయంగా బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ తరఫున 40 శాతం వరకు టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కూటమి నాయకులకు పలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ — “జయహో బీసీ.. జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం” అనే నినాదంతో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు సామర్థ్యం, నిజాయితీ, సమర్థతతో పాటు సోషల్ రీ-ఇంజినీరింగ్ విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాలే నేతల పనితీరుకు అసలైన కొలమానమని, ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రమించాలని చంద్రబాబు నిర్దేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here