విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన అనుభవాన్ని పంచుకున్నారు.
darshan of Sri Kanaka Durga Ammavaru
View on X
అమ్మవారి దర్శనం తనకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. అదే సమయంలో భక్తుల్లో కనిపించిన ఉత్సాహం, వారి సానుకూల స్పందన తనకు ఆనందాన్ని ఇచ్చాయని తెలిపారు.
దర్శనాలు, సేవల పట్ల భక్తులు సంతృప్తిగా ఉండటం సంతోషకరమని వెల్లడించారు. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో సీఎం దంపతుల దర్శనం ప్రాధాన్యం సంతరించుకుంది.





































