చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల మొదటి రోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎంపీని నామినేషన్ కేంద్రంలోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో వాహనాలు కార్యకర్తల వైపు దూసుకెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఘర్షణలో టీడీపీ కార్యకర్త మధుతో పాటు పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ నేతలు మధుసూదన్ రాయల్, సుహేల్ బాషా, ముల్లంగి రమణ, అసూరి బాలాజీతో పాటు ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గాయపడినట్లు సమాచారం.
మరోవైపు, ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి పోలీసులతో రంగంలోకి దిగారు. స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఇరుపక్షాల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. దీంతో నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.
అయితే, ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ కార్యాలయంలోనే ఉండటంతో బయట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇదిలావుంటే, మరోవైపు తిరుపతిలో నామినేషన్ కేంద్రం సమీపంలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారశైలిని నిరసిస్తూ కూటమి పక్షాలు ఆందోళన చేపట్టాయి.






































