తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమీషన్ల కోసం రూ. లక్ష కోట్లను గోదావరిలో వృథాగా పోశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎల్నినో పరిస్థితులు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పలు కీలక ఆరోపణలు గుప్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరెవరికీ లేని ప్రత్యేక వెసులుబాట్లు కేసీఆర్ ఫామ్ హౌస్కు మాత్రమే ఎందుకున్నాయని ప్రశ్నించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పంచపాండవుల చెరువుకు ప్రత్యేకంగా కాలువ తవ్వి, అక్కడి నుంచి మోటార్ల ద్వారా నేరుగా కేసీఆర్ ఫామ్హౌస్కు సాగునీరు తరలిపోతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలకు లేని ప్రత్యేక ఏర్పాట్లు కేసీఆర్కు ఎందుకు కల్పించారని నిలదీశారు. ఫామ్హౌస్కు సాగునీటిని మళ్లించే ఈ ఎత్తిపోతల తీరుపై నిజనిర్ధారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా అని సీఎం ప్రశ్నించారు.
2015లోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది ఎవని నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో ఎల్నినో ప్రభావం ఉంటే, అక్కడంతా కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే కరవు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. సాగునీరు, ప్రాజెక్టుల అంశాలపై ఏ వేదికపైౖన చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.










































