ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు హాజరు అయ్యారు. కరోనా నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కొద్దిమంది నేతలు మాత్రమే పాల్గొన్నారు.
ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారి స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు మంత్రులుగా సీఎం వైఎస్ జగన్ అవకాశమిచ్చారు. కాగా అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ, వేణుగోపాలకృష్ణకు రహదారులు-భవనాల శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu