భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. రాయపూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇటీవల శ్రీలంక తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను కూడా సొంత గడ్డపై ఓడించి సిరీస్ చేపట్టాలని భావిస్తోంది. అయితే తొలి వన్డేలో భారీ స్కోర్ చేసినా, గెలవడానికి చెమటోడాల్సి రావడం న్యూజిలాండ్ ఎంత బలంగా ఉందో టీమిండియాకు అనుభవమయింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ ఛేదనలో స్వల్ప తేడాతో ఓటమిపాలయిన కివీస్ నేడు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో మైదానంలోకి దిగనుంది. దీంతో రెండు జట్లు మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది.
ఇక భారత్ బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నప్పటికీ తొలివన్డేలో శుభ్‌మన్ గిల్ ఒక్కడే రాణించాడు. డబుల్ సెంచరీతో చెలరేగిన అతడికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. మంచి ఆరంభాన్ని ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ బ్యాటర్ ఇషాన్ కిషన్, బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ రాణించలేకపోవడం టీమిండియాకు కొంత ఆందోళన కలిగిస్తోంది. నేటి మ్యాచ్‌లో వీరు రాణించడంపైనే భారత్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే, న్యూజిలాండ్ కూడా బలంగా కనిపిస్తోంది. ఉప్పల్ మ్యాచ్‌లో ఏడో నెంబర్ స్థానంలో బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్ 140 పరుగులు చేసి టీమిండియాకు ముచ్చెమటలు పట్టించాడు. మరో బ్యాటర్ శాంట్నర్ కూడా అర్ధ సెంచరీ సాధించి జట్టును గెలిపించినంత పనిచేశాడు.
అలాగే వీరితో పాటుగా ఫిన్ ఆలెన్, కాన్వే, లాథమ్, ఫిలిప్స్ తదితర బ్యాటర్లు రాణించాలని కివీస్ శిబిరం కోరుకుంటోంది. ఇంకా పేస్ త్రయం షిప్లే, ఫెర్గూసన్, టిక్నెర్‌ల బౌలింగ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. దీంతో భారత బ్యాట్స్‌మెన్ నేడు పూర్తి సామర్ధ్యం మేరకు రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో వెటరన్ షమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయితే హైదరాబాదీ పేసర్ సిరాజ్ నాలుగు వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ ఫర్వాలేదనిపించగా.. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. కాగా 60 వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన రాయ్‌పూర్ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. ఇక మ్యాచ్ నేటి మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్/ఉమ్రాన్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ షమి, సిరాజ్.
న్యూజిలాండ్: ఆలెన్, కాన్వే, నికోల్స్, మిచెల్, లాథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, షిప్లే, ఫెర్గూసన్, టిక్నెర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE