అమెరికాలో విదేశీ ఉద్యోగులకు షాకిచ్చిన ఐబీఎం.. హెచ్‌1బీ, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లు బంద్

IBM Halts H-1B Visa and Green Card Sponsorships in US Consulting Unit

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) షాకిచ్చింది. తన కన్సల్టింగ్ విభాగంలో ఇకపై హెచ్‌1బీ (H-1B) వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విభాగంలో 1.50 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా, ఈ నిర్ణయంతో అమెరికా టెక్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణుల్లో అనిశ్చితి నెలకొంది.

ప్రభావిత ఉద్యోగులకు ఐబీఎం రెండు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇచ్చింది. వారు వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి పనిచేయవచ్చు లేదా వచ్చే నెలాఖరులోగా ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోవచ్చు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవడానికి 3 వారాల గడువు ఇవ్వగా, విదేశాల్లో పనిచేయడానికి అంగీకరించని వారికి 3 నెలల జీతాన్ని పరిహారంగా ఇచ్చి డిసెంబరు 31ని చివరి పని దినంగా నిర్ణయించినట్లు సమాచారం.

అమెరికాలో గతంలో నైపుణ్యం గల వర్కర్ల లభ్యత తక్కువగా ఉండటంతో వీసా కార్యక్రమాలను వినియోగించుకున్నామని, ఇప్పుడు దేశీయంగా నిపుణుల లభ్యత పెరిగిందని, వ్యాపార అవసరాలు కూడా మారాయని ఐబీఎం అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు వీసా ఎంపిక విధానాల్లో మార్పులు, కొత్త హెచ్‌1బీకి లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదన, వలస విధాన తనిఖీలు వంటి అంశాలు కూడా ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐబీఎం కెరీర్ పోర్టల్‌లో ఈ నెల 19న ప్రచురించిన వివరాల ప్రకారం ఇతర దేశాల్లోని శాఖల్లో 1,278 ఖాళీలు ఉండగా, వాటిలో 1,125 ఖాళీలు భారత్‌లోనే ఉన్నాయని ‘రెస్ట్‌ఆఫ్‌వరల్డ్’ వెబ్‌సైట్ తెలిపింది. అయితే ఏళ్ల తరబడి అమెరికాలో పనిచేసిన తర్వాత భారత్‌కు వస్తే జీతంలో 80 శాతం వరకు తగ్గిపోయే అవకాశం ఉందని ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న టెక్ రంగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని ఇన్‌క్రూటర్ సీఈవో అనిల్ అగర్వార్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here