రాహుల్‌ ద్రవిడ్‌ తో సౌరవ్ గంగూలీ భేటీ

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, BCCI President Sourav Ganguly, board of control for cricket in india, latest sports news, latest sports news 2019, Mango News, national cricket academy, Rahul Dravid, sports news

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ డిసెంబర్ 26, గురువారం నాడు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అధ్యక్షుడు రాహుల్‌ ద్రవిడ్‌ తో భేటీ అయ్యాడు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎన్‌సీఏలో అనుసరించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా 5 గంటలపాటు చర్చించారు. భారత్ ఆటగాళ్లకు సంబంధించిన ఫిట్‌నెస్ పునరావాస ప్రోటోకాల్‌ వ్యవహారాలను క్రమబద్ధీకరించడంపై ముఖ్యంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా ఎన్‌సీఏకు వెళ్లకుండా ప్రైవేట్ ట్రైనర్ల సహాయంతోనే కోలుకునే ప్రయత్నాలు చేశారు. బుమ్రా గాయం నుంచి తిరిగి కోలుకున్న తర్వాత ఫిట్‌నెస్‌ టెస్టు కోసం ఎన్‌సీఏకు వెళ్లగా, గాయం విషయంలోఎన్‌సీఏని సంప్రదించని కారణంగా అతడికి పరీక్ష నిర్వహించడానికి నిరాకరించారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే ఎన్‌సీఏలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా గంగూలీ, ద్రవిడ్‌ సమావేశమయ్యారు.

గతంలో ఆటగాళ్లు ఎన్‌సీఏని సంప్రదించే విషయంలో గంగూలీ స్పందిస్తూ, భారత్‌ క్రికెట్‌కు చెందిన ప్రతి అంతర్జాతీయ ఆటగాడి కెరీర్లో ఎన్‌సీఏ ముఖ్యపాత్ర పోషిస్తుందని, ఆటగాళ్లకు అన్ని ప్రక్రియలూ ఎన్‌సీఏ ద్వారానే జరగాలని అన్నారు. అలాగే ఆటగాళ్లకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కూడా ఎన్‌సీఏకే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్‌సీఏలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యక్షుడు రాహుల్ ద్రవిడ్‌తో చర్చించి, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని గంగూలీ పేర్కొన్నారు. మరోవైపు భారత ఆటగాళ్లు గాయపడ్డ సమయంలో ఎన్‌సీఏకు వెళ్లేందుకు ఎక్కువుగా ఇష్టపడడం లేదని టీంయాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. గతంలో ఎన్‌సీఏకి వెళ్లి కోలుకున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా, పేస్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ తర్వాత కొంతకాలానికే తిరిగి గాయపడడంతో ఆటగాళ్లు ఎన్‌సీఏలోని ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. గురువారం వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో ఎన్‌సీఏ అంశాలతో పాటుగా, క్రికెట్‌ సలహాదారుల సంఘం (సీఏసీ), కొత్త సెలక్టర్ల నియమాకంపై కూడా చర్చించినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =