కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : పవన్ కళ్యాణ్

Appeal People to be Vigilant Amid Corona Second Wave, Corona Second Wave, Corona Second Wave Effect, Jana Sena chief Pawan Kalyan, Mango News, pawan kalyan, pawan kalyan coronavirus, Pawan Kalyan Health, Pawan Kalyan Health Condition, Pawan Kalyan Health News, Pawan Kalyan Latest News, Pawan Kalyan releases press note, Pawan Kalyan Says his Health is Stable, Second COVID-19 Wave

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. వైద్య నిపుణుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడుతోందని, వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తున్నానని పేర్కొన్నారు. “వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను. నేను కరోనా బారిన పడ్డాను అని తెలిసినప్పటి నుంచి నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి కావాలని ప్రతి ఒక్కరూ ఆశించారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. సందేశాలు పంపారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్ధన మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు, యాగాలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేకున్నాను. ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి, మీతోపాటే ప్రజల కోసం నిలబడతాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మరణాలు తగ్గే విధంగా చూడటం ప్రభుత్వ బాధ్యత:

“కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉన్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో రోజుకు ఏడువేలకు పైగా కేసులు, తెలంగాణలో నాలుగువేలకు పైగా కేసులు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం నమోదవుతున్నాయి అనీ, అంతకు కొన్ని రెట్లు కేసులు ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారినపడినవారికి అవసరమైన మేరకు ఆసుపత్రుల్లో బెడ్స్, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. పరిస్థితిని ముందే అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయలేకపోవడం వల్లే ఆందోళనకర స్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేవని రోగులను చేర్చుకోని స్థితి వచ్చింది. అదే విధంగా రోగులకు అవసరమైన మందుల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. మరణాలు తగ్గే విధంగా వైద్య సేవలు మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత. అత్యవసరంగా కోవిడ్ కేంద్రాలను భారీగా తెరిచి, వైద్య పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలి. వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకోవాలి” అని పవన్ కళ్యాణ్ సూచించారు.

మాస్క్ శానిటైజర్లు మరచిపోవద్దు:

“కరోనా వ్యాప్తి నిరోధంలో ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నా ప్రజలు తమ వంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఇవి అందరికీ తెలిసినవే అయినా మరోమారు మీకు గుర్తు చేస్తున్నాను. మాస్క్ ధరించడటంతోపాటు ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతోగానీ, శానిటైజర్ తోగానీ శుభ్రం చేసుకోవాలి. ఇంటి బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించడం ఒక నియమంగా తీసుకోవాలి. వైద్యుల సూచనలు అనుసరించి వారు చెప్పిన విధంగా రోగ నిరోధక శక్తిని పెంచే మల్టీవిటమిన్స్, మందులు తీసుకోవాలి. నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించడం (గార్డింగ్) చేయడం అవసరం. రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. ఏ మాత్రం కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ అని తేలిన పక్షంలో ఏ మాత్రం ఆందోళనకు లోను కాకుండా వైద్యులను సంప్రదించి వారు చెప్పిన విధంగా ఔషధాలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీళ్ళు తాగటంతోపాటు ఆవిరిపట్టడం లాంటివి చేయాలి. ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకొంటున్నా ఐసోలెట్ కావడం చాలా అవసరం. కుటుంబ సభ్యులకు, ఇతరులకు వ్యాప్తి కాకుండా ఉంటుంది. కరోనా కట్టడిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో ఇతర సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, మున్సిపల్, పంచాయతీ ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ చైతన్యపరుస్తున్నారు. వీరంతా ఉద్యోగ విధుల్లో ఉన్నా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిపెట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =