మహిళ ఇన్నోవేషన్ కు చేయూత: తెలంగాణ-గుజరాత్‌ల మధ్య అవగాహన ఒప్పందం

I-Hub Gujarat, I-Hub Gujarat and WE Hub Telangana Collaborated, I-Hub Gujarat and WE Hub Telangana Collaborated For Women-led Startups, Mango News, telangana, Telangana incubator WE Hub partners, WE Hub inks MoU with i-Hub to support, WE Hub partners with i-Hub of Gujarat, WE Hub Telangana, Women entrepreneurship in Gujarat, Women-led Startups

మహిళ ఇన్నోవేషన్ కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలు ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్ లకి చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్, గుజరాత్ లోని ఐ-హబ్ లు శనివారం నాడు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్టప్ లను ఎంపిక చేసుకొని వాటికి అవసరమైన అన్ని రకాల చేయూతను అందించడంతో పాటు, ముఖ్యంగా ఆయా స్టార్టప్ లు మరింత మూలధనాన్ని అందుకునేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ అవగాహన ఒప్పంద కార్యచరణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరియు గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమ, విభావరి బెన్ దవే (మహిళ మరియు శిశు సంక్షేమ ప్రాథమిక విద్యా శాఖ మంత్రి)ల సమక్షంలో తెలంగాణ మరియు గుజరాత్ కు చెందిన సీనియర్ అధికారులు జయేష్ రంజన్ మరియు అంజు శర్మలు ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా సుమారు 240 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుటెక్, మెడిటెక్, ఫిన్ టెక్ వంటి రంగాల్లోని వారిని ఎంచుకుని, మూడు నెలల పాటు ప్రి ఇంక్యుబేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో శిక్షణ అందించి, తుది దశలో 20 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేస్తారు. రెండు రాష్ట్రాలకు చెందిన 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు వీ-హబ్ మరియు ఐ-హబ్ నేరుగా వారు ఎంచుకున్న రంగాల్లో అన్ని విధాల మద్దతును అందిస్తాయి. ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించి జరిగిన వర్చువల్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఇన్నోవేషన్ రంగంలో మహిళలకు సంబంధించి వీ-హబ్ ఆదర్శంగా నిలిచింది:

2017 నవంబర్ లో తాము మహిళా ఔత్సాహిక యువత కోసం ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ను వీ-హబ్ పేరిట ఏర్పాటు చేసిన రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న విజన్ మరియు నిబద్ధత చాలా మందికి అర్థం కాలేదని, అయితే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్ట్ అప్ లకు అందించిన చేయూత ద్వారా అనేక మంది మహిళలకు అద్భుతమైన చేయూత అందిందన్నారు. వీ-హబ్ కార్యక్రమాల ద్వారా అనేక మహిళా స్టార్టప్ లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సైతం లభించిందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇన్నోవేషన్ రంగంలో, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వీ-హబ్ ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈరోజు ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా భవిష్యత్తులో మరింత గొప్ప ప్రగతిని ఈ రంగంలో సాధిస్తామన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

ఈ ఒప్పందం ద్వారా కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు రాష్ట్రాలకు చెందిన మహిళా స్టార్టప్ లకు తగిన గుర్తింపు లభిస్తుందని, అవి మరింత ప్రగతి సాధిస్తాయని అన్నారు. ఈరోజు జరిగిన ఒప్పందం నిజమైన ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో, కేవలం సామర్ధ్యమే ప్రామాణికంగా మహిళా ఇన్నోవేషన్ మరింత ముందుకు పోతుందని కేటీఆర్ అన్నారు. దేశంలో ముందువరుసలో ఉన్న రెండు చురుకైన రాష్ట్రాలు తెలంగాణ – గుజరాత్ లు ఈ అవగాహన ఒప్పందం ద్వారా మహిళా ఇన్నోవేషన్ ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు కలిసి పనిచేయడం చరిత్రలో నిలిచిపోతుందని, ఇరు రాష్ట్రాల అనుభవాలు, నాలెడ్జ్, దేశ ఇన్నోవేషన్ రంగానికి మరింత ఊతాన్ని ఇస్తాయని, ఈ అవగాహన ఒప్పందంలో భాగస్వాములైనందుకు వీ-హబ్ కి గుజరాత్ మంత్రులు ఇరువురు అభినందనలు తెలియజేశారు.

ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా దేశంలోనే మొదటి సారి మహిళా ఇన్నోవేషన్ రంగంలో రెండు కీలక రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని మహిళలు నడిపే స్టార్టప్ లకు ప్రి ఇంక్యుబేషన్, ఇంక్యుబేషన్ మరియు పాలసీ స్టేక్ హోల్డర్స్ లతో అవసరమైన సంప్రదింపులకు సంబంధించి అన్ని విధాల మద్దతు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వ్యక్తం చేశారు.

ఈ అవగాహన ఒప్పందం సందర్భంగా మాట్లాడిన గుజరాత్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అంజు శర్మ, ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్ లను బలోపేతం చేస్తూ దేశంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా కార్యాచరణ ఉండబోతుందని అన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నోవేషన్ అనుభవాలను, ఆదర్శ పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా వీ-హబ్, ఐ-హబ్ లకు ఉపయుక్తంగా ఉంటుందని అంజు శర్మ అన్నారు.

గత మూడు సంవత్సరాలుగా వీ-హబ్ సుమారు మూడున్నర వేల మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పని చేసిందని, 11 స్టార్టప్ ప్రోగ్రాములను పూర్తి చేసిందని, 148 స్టార్టప్ లను ఇంక్యూబెట్ చేయడంలో వీ-హబ్ విజయం సాధించిందని వీ-హబ్ సీఈవో దీప్తి రావుల అన్నారు. గత మూడు సంవత్సరాలుగా వీ-హబ్ కు ఇన్నోవేషన్ రంగంలో సమకూరిన అనుభవాన్ని, నాలెడ్జ్ ను గుజరాత్ కు చెందిన ఐ-హబ్ కు అందిస్తామని, ఇలాంటి భాగస్వామ్యాల ద్వారా భారత దేశాన్ని మహిళా ఇన్నోవేషన్ కి అంతర్జాతీయ రాజధానిగా మార్చేందుకు అవకాశాలు ఏర్పడతాయని దీప్తి రావుల ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =