నగరంలో గణేష్ నిమజ్జనం: విధుల్లో19 వేలమంది పోలీస్ సిబ్బంది, ట్యాంక్ బండ్ వద్ద 40 క్రేన్ లు ఏర్పాటు

2021 Ganesh Immersion, Ganesh Immersion Arrangements, Ganesh Immersion In Hyderabad, Ganesh Immersion In telangana, Ganesh Immersion Latest Updates, Hyderabad, Khairatabad Ganesh Immersion, Khairatabad Ganesh Immersion 2021, Mango News, Minister Talasani Srinivas, Minister Talasani Srinivas Held Review over Ganesh Immersion Arrangements, Minister Talasani Srinivas Held Review over Ganesh Immersion Arrangements in Hyderabad, Talasani Srinivas Held Review over Ganesh Immersion

గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వపరంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్, కలెక్టర్ శర్మన్, వాటర్ వర్క్స్ ఈడీ సత్యనారాయణ, ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్, ఆర్టీఏ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విధుల్లో పాల్గొననున్న 19 వేలమంది పోలీస్ సిబ్బంది:

హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షలాది మంది ఈ శోభాయాత్ర పాల్గొంటారని మంత్రి వివరించారు. జీహెఛ్ఎంసీ పరిధిలో సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బంది విధులలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి క్రేన్ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారిని నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. వాహనదారులు, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ డైవర్షన్ కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అవసరమైన ప్రాంతాలలో భారికేడ్ లను ఏర్పాటు చేయాలని చెప్పారు.

ట్యాంక్ బండ్ పరిసరాలలో 40 క్రేన్ లు, మొత్తం జీహెఛ్ఎంసీ పరిధిలో 320 క్రేన్స్ ఏర్పాటు:

విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాలలో 40 క్రేన్ లు, మొత్తం జీహెఛ్ఎంసీ పరిధిలో 320 క్రేన్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిధిలో 32 మంది స్విమ్మర్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లను కూడా సిద్దంగా ఉంచనున్నట్లు తెలిపారు. 2600 ఎల్ఈడీ లైట్ లను ట్యాంక్ బండ్ పరిధిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ తో పాటు 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ వద్ద కూడా విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. శోభాయాత్ర జరిగే రహదారులలో ఎక్కడా మ్యాన్ హోల్స్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. భక్తులకు త్రాగునీరు అందించేందుకు 30 లక్షల వాటర్ ప్యాకెట్స్ ను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ కోసం 8700 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, వీరు 3 షిఫ్ట్ లలో నిరంతరం విధులు నిర్వహిస్తారని జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వివరించారు. అదేవిధంగా వాటర్ వర్క్స్, హెఛ్ఎండీఏ, జీహెఛ్ఎంసీ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి విగ్రహాల నిమజ్జనం జరిగిన ప్రాంతాలలో వ్యర్దాల తొలగింపు కు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం:

ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నిర్వహించే ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 6 వద్ద హుస్సేన్ సాగర్ లో పూడిక తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విగ్రహాల నిమజ్జనం కోసం వెయ్యి వివిధ రకాల వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, గణేష్ నవరాత్రుల ఉత్సవాల నిర్వహకులు అవసరమైన వారు ఈ వాహనాలను వినియోగించుకోవాలని కోరారు. వీటి పర్యవేక్షణ కోసం 10 మంది ఆర్టీఏఅధికారులు, 50 మంది మోటార్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించినట్లు చెప్పారు. ట్యాంక్ బండ్ పై 2 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2 కంట్రోల్ రూమ్ లను, ఎన్టీఆర్ మార్గ్ లో వాటర్ వర్క్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా శాఖల సేవల కోసం భక్తులు, ఉత్సవాల నిర్వహకులు కంట్రోల్ రూమ్ లను వినియోగించుకోవాలని కోరారు. ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించడానికి భక్తులు, నిర్వహకులు అధికారులకు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =