రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ‘మహిళా శక్తి సూపర్ బజార్ల’ను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్‌లు, గోదాముల నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వెల్లడించారు.
తొలి దశలో 119 మహిళా సూపర్ బజార్లు
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ 119 మహిళా శక్తి సూపర్ బజార్ల స్థాపనకు స్థలాలను కేటాయించనున్నారు. ఈ సంఘాల వ్యాపార వృద్ధి కోసం కేవలం నామమాత్రపు లీజుతో వంద ఎకరాల భూమినైనా ప్రభుత్వం తరఫున అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, ఇకపై కేవలం రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు ఉంచే పాత పద్ధతికి స్వస్తి పలికి, మహిళా సంఘాలే నేరుగా వడ్లను కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేసేలా సరికొత్త బాధ్యతలను అప్పగించనున్నారు.
మహిళా సంఘాల రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
మహిళా సంఘాలు వ్యాపార దక్షతలో అదానీ, అంబానీ వంటి దిగ్గజాలతో పోటీ పడాలనే ఉన్నత ఆశయంతో ఇప్పటికే వారికి 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులను కేటాయించడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రాలలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ పెట్రోల్ బంక్‌ల ద్వారా వారు నెలకు రూ.4-5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను అందించడంతో పాటు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,390 కోట్లను చెల్లించింది. గతంలో రూ.5 లక్షల వరకు మాత్రమే ఉన్న వడ్డీ లేని రుణాల పరిమితిని, మహిళల చిత్తశుద్ధిని గౌరవిస్తూ ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణలో మహిళా సాధికారతను కేవలం మాటలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వారికి భారీ ఆర్థిక వనరులను, వ్యాపార అవకాశాలను కల్పించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సరికొత్త మార్పుకు నాంది పలికింది. ప్రతి నియోజకవర్గంలో రాబోయే సూపర్ బజార్లు, రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేసి, వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా నిలబెడతాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




































