క్యూర్‌ పరిధిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. అర్హతలు, రిజర్వేషన్ల వివరాలు ఇవే!

Hyderabad CURE Region Opens Indiramma Housing Applications, Check Eligibility and Guidelines

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్‌ – CURE) పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎదురవుతున్న స్థలాల కొరతను అధిగమించేందుకు బహుళ అంతస్తుల (G+3) మోడల్‌లో ప్లాట్లను నిర్మించి అర్హులైన పేదలకు అందించేలా పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల బ్రోచర్‌ను గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా విడుదల చేశారు.

మిగతా నియోజకవర్గాల్లోనూ స్థలాలను త్వరలోనే గుర్తించి వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న నగర పేదల సొంతింటి కల నెరవేరనుంది. ఈ పథకం కింద ఇళ్ల కేటాయింపులు, దరఖాస్తు విధానం మరియు నిబంధనలకు సంబంధించిన ముఖ్య వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

  • దరఖాస్తు ప్రక్రియ విధానం: లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో మీ సేవా కేంద్రాలు, వాట్సప్ (80969 58096) లేదా మీసేవా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, ఆగస్టు 10ని చివరి తేదీగా నిర్ణయించారు.

  • టోకెన్ అడ్వాన్స్ నిబంధన: దరఖాస్తుతో పాటు రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు కేటాయించకపోతే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు, కేటాయిస్తే లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.

  • అర్హత ప్రమాణాలు: దరఖాస్తుదారులు కనీసం 10 ఏళ్లుగా క్యూఆర్ పరిధిలో నివసిస్తూ ఉండాలి, సొంత ఇల్లు లేదా ప్లాటు ఉండకూడదు. అలాగే వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి.

  • ఇంటి నిర్మాణం – కొలతలు: బహుళ అంతస్తుల్లో తూర్పు, పడమర ముఖాలతో ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ప్రతి ప్లాటు రిజిస్ట్రేషన్ విస్తీర్ణం 528 చదరపు అడుగులుగా ఉంటుంది.

  • రిజర్వేషన్ల వివరాలు: కేటాయింపుల్లో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, అవుట్ సోర్సింగ్/4వ తరగతి ఉద్యోగులు/పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్లు అమలవుతాయి. మిగతా 50% సీట్లను జనరల్ విభాగానికి కేటాయిస్తారు. ప్రతీ విభాగంలోనూ మహిళలకు 30% అంతర్గత రిజర్వేషన్ ఉంటుంది.

ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో నగరవ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. స్థానిక హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఇప్పటికే దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరట నిస్తుందని, నగరంలో సొంతింటి నిరీక్షణకు ఇది ఒక సరైన పరిష్కారంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here