మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. ప్రతి విద్యా సంస్ధలో టోల్‌ఫ్రీ నంబర్‌ – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Directs Tough Anti-Drug Law, Toll Free No in All Schools and Colleges

తెలంగాణలో విద్యాసంస్థలను మత్తుపదార్థాల రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల ప్రవర్తనలో అసాధారణ మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అలాగే డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు ప్రతి క్యాంపస్‌లో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

రెండోసారి పట్టుబడితే జైలే..

మత్తుపదార్థాల వినియోగంలో తొలిసారి పట్టుబడిన వారిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. అయితే అదే వ్యక్తి రెండోసారి డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని రూపొందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ బాధ్యత కేవలం ఈగల్ ఫోర్స్‌కే పరిమితం కాకుండా ప్రతి పోలీసు అధికారి సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. యువతను మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి

డ్రగ్స్ నియంత్రణతో పాటు రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అమల్లోకి వస్తే విద్యాసంస్థల్లో సురక్షిత వాతావరణం నెలకొనడమే కాకుండా నగర ట్రాఫిక్ వ్యవస్థ కూడా మరింత క్రమబద్ధీకరణకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here