ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

AP Local Body Elections 2026 SEC Anil Chandra Punetha Releases Official Schedule

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుదీర్ఘంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా అమరావతిలో అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీస్ (ULBs) అంటే 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు మరియు 10 నగర పంచాయతీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. పట్టణ స్థానిక పోరులో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 వరకు గడువు ఇవ్వగా, 19న పరిశీలన (స్క్రూటినీ), 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

మరోవైపు పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబరు 3న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 19న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబరు 5న ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే గ్రామ పంచాయతీలకు నవంబర్ 26, నవంబర్ 29 మరియు డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం మరియు సీట్ల సర్దుబాట్లలో నిమగ్నమయ్యాయి.

పురపాలక ఎన్నికలు..

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అక్టోబరు 28న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబరు 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  • నామినేషన్ల గడువు: అక్టోబరు 18
  • ఉపసంహరణ గడువు: అక్టోబరు 21
  • పోలింగ్‌ తేదీ: అక్టోబరు 28
  • ఓట్ల లెక్కింపు: అక్టోబరు 30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..

  • నోటిఫికేషన్‌: అక్టోబరు 19
  • నామినేషన్ల గడువు: అక్టోబరు 23
  • ఉపసంహరణ గడువు: అక్టోబరు 27
  • ఎన్నికల తేదీ: నవంబరు 3
  • ఓట్ల లెక్కింపు: నవంబరు 5

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

తొలి విడత ఎన్నికలు..

  • నోటిఫికేషన్‌: నవంబరు 13
  • నామినేషన్ల గడువు: నవంబరు 17
  • ఉపసంహరణ గడువు: నవంబరు 21
  • పోలింగ్‌ తేదీ: నవంబరు 26

రెండో విడత ఎన్నికలు

  • నోటిఫికేషన్‌: నవంబరు 16
  • నామినేషన్ల గడువు: నవంబరు 20
  • ఉపసంహరణ గడువు: నవంబరు 24
  • పోలింగ్‌ తేదీ: నవంబరు 29

మూడో విడత ఎన్నికలు..

  • నోటిఫికేషన్‌: నవంబరు 19
  • నామినేషన్ల గడువు: నవంబరు 23
  • ఉపసంహరణ గడువు: నవంబరు 27
  • పోలింగ్‌ తేదీ: డిసెంబరు 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here