కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 21, శనివారం నాడు కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు. కరీంనగర్ లోనే సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. మూడు రోజుల క్రితం ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో సీఎం సూచనల మేరకు అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. దీని ఫలితంగా స్థానికులెవరికీ కరోనా వైరస్ ఎవరికీ సోకలేదు.
కరీంనగర్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే సీఎం కేసీఆర్ కరీంనగర్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కానీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 20, శుక్రవారం నాటికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 18 కు చేరుకునట్టు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)తో పాటుగా వివిధ వైద్య సంఘాల ప్రతినిధులతో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.