ఆళ్ల రాక వెనుక జ‌గ‌న్ వ్యూహం!

Alla Ramakrishna reddy, CM Jagan, AP Politics, YCP,YSRCP,Mangalagiri,Sajjala Ramakrishna Reddy,Vijayasai Reddy,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Elections,andhra pradesh,Mango News Telugu,Mango News
Alla Ramakrishna reddy, CM Jagan, AP Politics, YCP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఎత్తుల‌కు పైఎత్తుల‌తో ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. ప‌డిపోతున్న వైసీపీ గ్రాఫ్ ను పెంచుకునేందుకు అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. సిద్ధం పేరుతో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌భ‌లు పెడుతూ కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్న జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు తాను చేసిన పనుల‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు వైసీపీ ముఖ్యులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారు కూడా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబుకు కౌంట‌ర్ గా స‌వాల్ విసులుతున్నారు. రాప్తాడు సభలో జ‌గ‌న్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష నేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. 99 శాతం హామీలు ఎక్కడ అమలయ్యాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై సీఎం జగన్ స్పందించక‌పోయినా సజ్జల రామకృష్ణారెడ్డి సై అన్నారు.

వైసీపీ ప్రధాన కార్యదర్శి గా వ్య‌వ‌హ‌రిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చర్చలు అసెంబ్లీలో జరుగుతాయని, చంద్రబాబు వాటిని వదిలిపెట్టి బయట సవాళ్లు విసురుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వం లో ఏం చేశాడో చెప్పాలన్నారు. కారు కూతలు ఎందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారన్నారు. అసలు మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం అమలు చేశామన్నది ముఖ్యమని సజ్జల తెలిపారు. 99 శాతం మ్యానిఫెస్టో పూర్తి అయిందని గర్వంగా చెప్పుకుంటున్నామని సజ్జల తెలిపారు. జగన్ పాలనలో ఏం ఉన్నాయి, ఏం అబద్ధాలనేది చెప్తే చర్చలకు వస్తామన్నారు. 50 రోజుల్లో అన్నీ తేలిపోతాయన్నారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా తాజా రాజ‌కీయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌ర్థుల‌కు బాధ్య‌తలు అప్ప‌గిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే వాటిపై పునఃప‌రిశీలిస్తున్న‌ట్లు కూడా క‌నిపిస్తోంది. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఎపిసోడ్ ను అందుకు ఉదాహ‌ర‌ణ‌గా భావించొచ్చు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల మళ్లీ వైసీపీలో చేరారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్ లో ఆయన వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆయనకు 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ పై 5,337 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అంతేకాకుండా ఆయ‌న రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) కు ఛైర్మన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. అయితే రెండో సారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్‌ చోటు కల్పించకపోవడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.

నాటి నుంచీ వైసీపీలో తీవ్ర అంత‌ర్మ‌థ‌నం న‌డుస్తోంది. ఆళ్ల పార్టీని వీడ‌డం, జ‌గ‌న్‌పై బాణాలు వేస్తున్న చెల్లి ష‌ర్మిల‌కు చెందిన పార్టీలో చేర‌డాన్ని జ‌గ‌న్ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ఎప్ప‌టినుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు నారా లోకేశ్ మ‌ళ్లీ మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జ‌గ‌న్ పై స‌వాల్ విసురుతున్న లోకేశ్ ను ఓడించాలంటే స్థానినికంగా బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గంతో పాటు, ఆర్థికంగానూ బ‌ల‌మైన వ్య‌క్తి అవ‌స‌ర‌మ‌ని వైసీపీ భావించింది. దాంతో గంజి విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలిసింది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆర్కేపై ఓడిపోయారు. అనంతరం టీడీపీ హయాంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. నారా లోకేష్ 2019లో మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడంతో గంజి చిరంజీవికి సీటు ఇవ్వలేదు. అయినా అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ.. లోకేష్‌కు అనుచరుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కొద్ది రోజుల‌కే ఆయ‌న‌ను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ప్ర‌క‌టించారు.

అయితే పదేళ్లు గా ఆళ్ల ఎమ్మెల్యేగా ఉండడంతో స్థానికంగా ఆయ‌న‌కు కేడ‌ర్ పెరిగింది. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా ఆయ‌న‌కే స‌పోర్ట్ గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని పార్టీ భావించింది. గ‌తంలో టీడీపీ నుంచి పోటీ చేసిన చిరంజీవికి అండ‌గా నిలిచే క‌డ‌ర్ అంతంత మాత్ర‌మే ఉంద‌ని గుర్తించింది. లోకేశ్ ను ఓడించాల‌ని జ‌గ‌న్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న త‌రుణంలో తిరిగి ఆర్కేను పార్టీలో చేర్చుకోవాలని జ‌గ‌న్ భావించిన‌ట్లు తెలిసింది. ఈక్ర‌మంలోనే నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆయ‌న సోద‌రుడు అయోధ్య‌రెడ్డి ఆళ్ల‌కు న‌చ్చ‌జెప్పారు. ఈక్ర‌మంలోనే ఆర్కే మ‌ళ్లీ వైసీపీలో చేరారు. పార్టీ చీఫ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే కాంగ్రెస్ లో చేరిన కీల‌క‌నేత‌గా   ఆళ్ల గుర్తింపుపొందారు. ఆయ‌న‌ను ఆ పార్టీకి దూరం చేయ‌డం ద్వారా చెల్లిని ఒక్క మాట కూడా అన‌కుండానే.. ఆమెకు చెక్ పెట్టిన‌ట్లు అయింద‌ని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈక్ర‌మంలోనే ఆళ్ల‌ను మ‌ళ్లీ చేర్చుకున్నారు. టికెట్ ఆయ‌న‌కే ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆళ్ల మాత్రం మంగ‌ళ‌గిరి టికెట్ బీసీకే జ‌గ‌న్ ఇస్తార‌ని, లోకేశ్ ఓట‌మికి కృషి చేస్తాన‌నిప్ర‌క‌టించారు. మ‌రో 20-30 ఏళ్లు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 11 =