పిఠాపురంలో.. ప‌వ‌న్ విన్ అయ్యేనా..!

Will Pawan Kalyan Win In Pithapuram This Time?, Will Pawan Kalyan Win, Pawan Kalyan Win In Pithapuram, Pawan Kalyan This Time Pithapuram, Janasena, Pawan kalyan, AP Elections, Pithapuram, Pithapuram Political News, AP Elections, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Janasena, Pawan kalyan, AP Elections, pithapuram

జ‌న‌సేన ఆవిర్భావం దినోత్స‌వం రోజున‌.. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీచేయ‌బోయే స్థానం ప్ర‌క‌టించి ఉత్కంఠ‌కు తెర‌వేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప‌వ‌న్ వెల్ల‌డించారు. తాజా రాజకీయ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని ప‌వ‌న్‌.. పిఠాపురాన్ని ఎంచుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మే అని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగే.. ఈసారైనా ప‌వ‌న్ గెలుస్తాడా.. లేదా అనే చ‌ర్చ‌లూ మొద‌ల‌య్యాయి. ఎందుకంటే..  2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నాటి నుంచీ భిన్న పంథాలో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆయ‌న ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితులు చాలాసార్లు క‌నిపించాయి. సొంతంగా నిల‌బ‌డ‌లేడ‌న్న అప‌వాదూ ఉంది.

పార్టీ ప్రారంభ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన ను స్థాపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాడు. అయితే.. ఒక్క‌డిగా పోరాడ‌లేక‌.. టీడీపీ, బీజేపీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు. 2014 లో నేరుగా పోటీలో దిగకుండా అవే పార్టీల‌కు  మ‌ద్ద‌తు ఇచ్చారు. 2019 ఎన్నికలలో సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేసినా, కేవలం ఒక సీటు మాత్రమే జ‌న‌సేన గెలిచింది. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ గాజువాక‌, భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల కూడా ఓడిపోయారు. తాజాగా జ‌ర‌గ‌బోయే ఏపీ ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా.. ప‌వ‌న్ గెలుస్తాడా లేదా అనేది ఉత్కంఠ‌గా మారింది.

పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండ‌లాలు ఉన్నాయి. 2019 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం.. నియోజకవర్గంలో 2,29,729 మంది ఓట‌ర్లు ఉన్నారు. వాటిలో కాపు సామాజిక వ‌ర్గ ఓట్లు అధికంగా ఉంటాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కుల ప్ర‌భావం కూడా బాగానే ఉంటుంది. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లుమార్లు ప‌రిశీల‌న‌లు చేసిన అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో గాజువాక‌, భీమ‌వ‌రంలో ఓడిపోయిన ప‌వ‌న్‌.. ఈసారి పొత్తులో భాగంగా గెలుపు ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ఓట్లు కూడా త‌మ‌కే ప‌డ‌తాయ‌ని జ‌న‌సేన అంచ‌నా వేస్తోంది.

బీజేపీ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. నియోజ‌క‌వ‌ర్గాన్ని జ‌న‌సేన‌కు కేటాయించ‌డంపై టీడీపీ భ‌గ్గుమంటోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన కొద్దిసేప‌టికే టీడీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే ధ్వంసం చేశారు. టీడీపీ జెండాల‌ను త‌గుల‌బెట్టారు. చంద్ర‌బాబును, లోకేశ్‌ను, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తీవ్ర‌స్థాయిలో దూషించారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిష్ఠ ప‌రిచేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డిన వ‌ర్మ‌కే టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈక్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు టీడీపీ మ‌ద్ద‌తు ఎంత వ‌ర‌కు ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. చంద్ర‌బాబును, ప‌వ‌న్ ను దూషించ‌వ‌ద్ద‌ని, నా టికెట్‌కు, ప‌వ‌న్ కు సంబంధం లేద‌ని ప్ర‌క‌టించిన వ‌ర్మ‌, కార్య‌క‌ర్త‌ల అభీష్టం మేర‌కు న‌డుచుకుంటాన‌ని చెప్పారు. ఈనేప‌థ్యంలో ఇండిపెండెంట్ గా అయినా బ‌రిలో ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అలాగే.. వైసీపీ నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత‌ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ప్ర‌క‌టించిన నాటి నుంచే ఆమె నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెంచారు.  గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుండి పోటీచేసి గెలిచిన గీత‌.. స్థానికంగా అంద‌రి అభిమానాల‌నూ చుర‌గొన్నారు. ఎవ‌రు పిలిచినా అందుబాటులో ఉంటార‌నే పేరు  పొందారు. ఈక్ర‌మంలో మ‌రోసారి పిఠాపురం నుంచి ఆమె నిల‌బ‌డితే ప‌వ‌న్‌కు గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు. మ‌రోవైపు వ‌ర్మ ఇండిపెండెంట్‌గా నిల‌బ‌డితే.. ఇద్ద‌రు కాపు నేత‌ల ఓట్లు చీల‌డం ద్వారా వ‌ర్మ కు క‌లిసొచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. జ‌న‌సేన పార్టీప‌రంగా చూస్తే.. నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్ బాగానే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల్లో జనసేన అభ్య‌ర్థిగా పోటీచేసిన మాకినీడి శేషు కుమారి మూడో స్థానంలో నిలిచారు. ఆమెకు 15 శాతం ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి. వైసిపి నుంచి పోటీ చేసిన పెండెం దొరబాబు 83,459 ఓట్ల (44 శాతం), 14,992 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీఎస్ఎస్ వర్మ 68,467 (36 శాతం) ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

మ‌రి ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పిఠాపురం ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా.. లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుంద‌నే చ‌ర్చ గ‌త ఎన్నిక‌ల్లో కూడా తెర‌పైకి వ‌చ్చింది. కానీ.. ఆయ‌న గాజువాక‌, భీమ‌వ‌రాల‌ను ఎంచుకుని ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌నే క‌సితో ఉన్న ఆయ‌న పిఠాపురం నుంచి బ‌రిలో దిగుతున్నారు. కూట‌మి బ‌లం.. గ‌తంలో ఓడిపోయార‌న్న సానుభూతి.. ప‌వ‌న్ ను గెలిపించుకోవాల‌నే త‌ప‌న‌, తాప‌త్ర‌యం ఉన్న అభిమానులు పిఠాపురంలో ఉండ‌డం.. ప‌వ‌న్ కు క‌లిసి వ‌స్తాయా.. లేదా, మున్ముందు రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మార‌తాయి.. అనేది వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =