‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మోదీ

America President Donald Trump, Donald Trump, Donald Trump India Visit 2020, Namaste Trump, Namaste Trump Event, Namaste Trump Event at Motera Stadium, Namaste Trump event in Ahmedabad, Namaste Trump event Live Updates, PM Modi, Prime Minister Narendra Modi, Trump India Visit News, US President Donald Trump
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన లక్షలమంది ప్రజలకు వారు అభివాదం చేశారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, అమెరికా సత్సంబంధాలు ఇలాగే కలకాలం కొనసాగాలని ఆకాక్షించారు. కొన్ని నెలల క్రితం హ్యూస్టన్ లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమానికి కొనసాగింపుగానే ఈ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్టు పేర్కొన్నారు. మొతేరా స్టేడియం కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీకు స్వాగతం పలుకుతోందని ట్రంప్ నుద్దేశించి అన్నారు. ట్రంప్ కు గుజరాత్ మాత్రమే కాకుండా యావత్ దేశం స్వాగతం పలుకుతుందని అన్నారు. మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని అన్నారు. ఇరుదేశాలు అనేక అంశాల్లో సహకరించుకుంటున్నాయని, మీకు అతిథ్యం ఇవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
అనంతరం మొతేరా స్టేడియానికి విచ్చేసిన 1.25 లక్షల మందిని ఉద్దేశించి నమస్తే అంటూ డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్ దేశానికి రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రధాని మోదీ తనకు నిజమైన స్నేహితుడన్నారు. ఐదు నెలల క్రితం టెక్సాస్‌లోని పెద్ద ఫుట్ బాల్ స్టేడియంలో మోదీకి అమెరికా స్వాగతం పలికిందని, ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్ తనకు స్వాగతం పలికిందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఎదుగుదల ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఛాయ్‌వాలాగా ప్రస్థానాన్ని ప్రారంభించిన మోదీ ఈ స్థాయికి చేరుకున్నారని, శ్రమ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే దానికి మోదీ నిదర్శనమని అన్నారు. భారతదేశం అద్భుతమైన అవకాశాలకు నిలయమని చెప్పారు. ప్రజల హక్కులను పరిరక్షించే క్రమంలోనే భారత్ -అమెరికాల మధ్య స్నేహం కుదిరిందని అన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ ఏడాదికి 2వేల చిత్రాలను నిర్మిస్తుందని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటర్లను భారత్ అందించిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని, ఉమ్మడిగా పోరాటం కొనసాగిస్తాయని ట్రంప్ అన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతుందని చెప్పారు. పలు మతాలు, వందకుపైగా భాషలతో కలిసిమెలిసి ఉండే భారతదేశం ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. అమెరికాలో అనేకమంది గుజరాతీలు ఉన్నారని, వారు అమెరికాకు ఎన్నో సేవలందించారని చెప్పారు. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం చేసుకుంటామని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. అత్యాధునిక ఆయుధాలు, హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేస్తామని చెప్పారు. వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, అమెరికా సహకారం అత్యున్నత స్థితిలో ఉందని చెప్పారు. భారత్ అందించిన ఇంతటి ఘనమైన స్వాగతాన్ని, గొప్ప ఆతిథ్యాన్ని చిరకాలం గుర్తుంచుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం ట్రంప్ తన సతీమణి మెలనియాతో కలిసి ఆగ్రా బయలుదేరారు. అక్కడ ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + four =