టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా దేశం తరపున ఒలింపిక్స్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకం కోసం దేశం యొక్క 100 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికాడు. అలాగే 2008లో షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణం తర్వాత దేశంలో రెండవ వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా నీరజ్ నిలిచాడు.
ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం పతకం అందించినఅందించిన నీరజ్ చోప్రాపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాజకీయనాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. “నీరజ్ చోప్రా… ఇది అపూర్వ విజయం. మీరు మీ మొదటి ఒలింపిక్స్ లోనే భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్‌ను తీసుకువచ్చారు. మీ ఫీట్ మన యువతకు స్ఫూర్తినిస్తుంది. భారతదేశం ఉప్పొంగింది! హృదయపూర్వక అభినందనలు!” అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
“యావద్భారతావని గర్వించదగిన మధురమైన క్షణం! టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభతో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించిన నీరజ్ చోప్రాకు హార్దిక అభినందనలు. స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో తొలి స్వర్ణం తీసుకొచ్చిన నీరజ్ చోప్రా భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను”అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. “టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించబడింది. నీరజ్ చోప్రా ఈ రోజు సాధించిన ఘనత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువ నీరజ్ అద్భుతంగా రాణించాడు. అతను అద్భుతమైన అభిరుచితో ఆడాడు మరియు అసమానమైన గ్రిట్ చూపించాడు. స్వర్ణం గెలిచినందుకు నీరజ్ కు అభినందనలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
6 కోట్ల నజరానా:
మరోవైపు ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రశంసించారు. హర్యానా ప్రభుత్వ పాలసీ ప్రకారం నీరజ్ చోప్రాకు రూ.6 కోట్ల నగదు బహుమతి, క్లాస్ I కేటగిరీ ఉద్యోగం ఇవ్వబడుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వం పంచకులలో అథ్లెట్ల కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నిర్మిస్తుందని, అతను కోరుకుంటే దానికి హెడ్ గా నియమించబడతాడని చెప్పారు. ఇక ఇతర ఆటగాళ్ల మాదిరిగానే అతనికి కూడా 50% రాయితీతో ప్లాట్ ఇవ్వబడుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ