రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబ్ నటుడు దీప్‌ సిద్ధూ మృతి

Punjabi Actor Deep Sidhu, Accused In Republic Day Violence Lost Life in Road Mishap

ప్రముఖ పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా గత ఏడాది జనవరి 26న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్ర‌కోట వ‌ద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎర్రకోట వద్ద జరిగిన హింస, విధ్వంస ఘటనలో హింసను ప్రేరేపించారంటూ నటుడు దీప్ సిద్దూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని భఠిండాకు వెళ్తుండగా కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ భారీ ట్రక్కును వెనక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకునట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే దీప్ సిద్దూను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు ప్రకటించారని చెప్పారు.

ఎర్రకోట ఘటనలో దీప్ సిద్దూపై పోలీసులు కేసు నమోదు చేసి ముందుగా గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా అరెస్టు చేశారు. ఏప్రిల్‌ లో ఆయనకు బెయిల్‌ వచ్చాక విడుదల అయినప్పటికీ మరోసారి వెంటనే అరెస్ట్ అయ్యారు. ఏప్రిల్ నెల చివర్లో మరోసారి బెయిల్‌ మీద విడుదలవగా, పోలీసులు విచారణకు పిలిచినప్పుడల్లా హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నటుడిగా మారకముందు దీప్‌ సిద్ధూ న్యాయవాదిగా పనిచేశారు. పంజాబ్ ప్రేక్షకుల్లో నటుడిగా ఆయనకు మంచి ఆదరణ లభించింది. దీప్ సిద్దూ మరణం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, పలువురు పంజాబ్ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eighteen =