నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్

CM KCR Directed Public Representatives, Implementation of New Acts In Telangana, implementation of new revenue act, KCR On Implementation of New Acts, KCR On Implementation of New Acts In Telangana, land registration programme, New Revenue Act, Telangana CM asks public representatives to work 24×7, Work 24 Hours for Implementation of New Acts

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల కాలంగా వలసపాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్‌లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని సీఎం వారికి సూచించారు.

నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు:

స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు పరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదే అన్నారు. భూములను క్రమబద్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోపాటు, రాష్ట్రంలోని అన్ని మిగతా పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలేకాకుండా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు.

పేదరికానికి కులం, మతం లేదు:

‘‘తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూ తగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గింది. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది’’ అని సీఎం అన్నారు.

ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్ లో నమోదు చేయాలి:

గుణాత్మక మార్పుకోసం, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినపుడు గరీబులకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ధరణి వెబ్ పోర్టల్ ను వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుంది. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్ పుస్తకాలను, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్‌లైన్ లో పొందుపరిచేలా చూడాలి:

ఒకనాడు స్లమ్ ఏరియాల్లోని గుడిసె నివాసాలు అభివృద్ధితో నేడు పక్కా ఇండ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మన చేతుల్లో పెట్టారు. చారిత్రిక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించ వలసిన బాధ్యత ఉన్నది. నోటరీ, జీవో 58,59 ద్వారా పట్టాలు పొందిన లబ్దిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్‌లైన్ లో పొందుపరిచేలా చూడాలి. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్ డేట్ చేయాలి.’’ అని సీఎం ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు.

కాగా, ఈ సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం మాట్లాడించారు. వారి వారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాస స్థలాలు, ఇండ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న సీఎం, ప్రతి సమస్యనూ అధికారులతో నోట్ చేయించారు. ఈ సమస్యల తక్షణమే పరిష్కారం కోసం విధి విధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, తమ రాజకీయ జీవితంలో హైదరాబాద్ తోపాటు, రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన సీఎంని తాము ఇంతవరకూ చూడలేదని సమావేశంలో పాల్గొన్న సీనియర్ ప్రజా ప్రతినిధులు సంబ్రమాశ్చర్యాలను వ్యక్తం చేశారు. పట్టణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు, సీఎస్ సోమేశ్ కుమార్, నగరాలు పట్టణ పరిధుల్లోని మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలాల, కౌసర్ మొహినొద్దీన్, పాషా ఖాద్రీ, సీఎంఓ అధికారులు, నగర, పట్టణాల పరిధిలోని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, సుధీర్ రెడ్డి, దానం నాగేందర్, సాయన్న, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, కాలేరు వెంకటేశ్, మైనంపల్లి హన్మంతరావు, ముఠా గోపాల్, ప్రకాశ్ గౌడ్, మహీపాల్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, ఆరూరి రమేశ్, బాల్క సుమన్, నన్నపునేని నరేందర్, గణేష్ బిగాల, బొల్లం మల్లయ్య యాదవ్, కోరుకంటి చందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, అంజయ్య యాదవ్, హైదరాబాద్ నగర్ మేయర్ బొంతు రాంమోహన్ తోపాటు, ఇతర కార్పొరేషన్ల మేయర్లు, జక్కా వెంకట్ రెడ్డి, నీలం గోపాల్ రెడ్డి, గుండా ప్రకాశ్ రావు, సునీల్ రావు, దుర్గ, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =