డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తాం – సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Held an Extended Meeting on the Education Sector, degree pg exams, Degree PG Exams in Telangana, KCR Meeting on the Education Sector, Telangana Degree PG Exams, Telangana Engineering, Telangana Engineering Exams

కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 16, గురువారం నాడు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ,ఏఐసీటిఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని సీఎం నిర్ణయించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాము. విద్యుత్ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నది. వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుతున్నాము. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతామని” సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

“ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఓపి పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది. అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. దోపిడీ ఆగిపోతుందన్నారు. ప్రస్తుతం అనాథ ఆడపిల్లలు పదవ తరగతి వరకు కస్తూరి భా పాఠశాలల్లో చదువుతున్నారు. తర్వాత వారి చదువుకు కావల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఈ విషయంలో త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామని” సీఎం కేసీఆర్ చెప్పారు.

కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు:

  1. విద్యావ్యవస్థ పవిత్రత (academic sanctity)ను కాపాడే ఉద్దేశ్యంతో యూజీసీ, ఏఐసీటిఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలి.
  2. ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలి.
  3. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
  4. రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =