దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఏటా బడ్జెట్ లో కేటాయింపులు: సీఎం కేసీఆర్

CM KCR Held High-level Preparatory Meeting on Dalit Bandhu Scheme Implementation, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme Implementation, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Updates, High-level Preparatory Meeting on Dalit Bandhu Scheme Implementation, KCR to Held Preparatory Meeting over Dalit Bandhu Scheme, Mango News, Preparatory Meeting over Dalit Bandhu Scheme, Telangana CM calls meeting on implementation of Dalit Bandhu, Telangana CM calls meeting on implementation of Dalit Bandhu Scheme

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరచి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టి, తర తరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలనే అత్యున్నత ఆశయంతో, సామాజిక బాధ్యతతో నిర్దిష్టమైన లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలులోకి తెచ్చామని సీఎం పునరుద్ఘాటించారు. హుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున వున్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని సీఎం తెలిపారు.

4 మండలాల్లో కూడా రెండు,మూడు వారాల్లోనే దశలవారీగా దళితబంధు నిధులు విడుదల:

దళితబంధు పథకాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వాసాలమర్రి, హుజూరాబాద్ లలో ప్రకటించిన విధంగా నిధులను విడుదల చేసామన్నారు. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని సీఎం స్పష్టం చేశారు. దళితబంధు పథకం దేశంలోనే మునుపెన్నడూ, ఎవరూ చేయని వినూత్న ఆలోచన. ఈ పథకానికి రూపకర్తలం, కార్యకర్తలం మనమేనన్నారు. పథకాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేసినవారమౌతామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళితబంధును ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన, రాష్ట్రం నలుమూలల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు-అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘దళితబంధుకు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగింది. దళిత ఎంపవర్ మెంట్ కింద 1000 కోట్ల రూపాయలను కూడా నేనే స్వయంగా అసెంబ్లిలో ప్రకటించిన. వివిధ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన దళిత పెద్దలు, మేధావులతో దఫధఫాలుగా చర్చించిన తర్వాత దళితబంధు కార్యక్రమానికి అమలు రూపకల్పన జరిగింది. ఎదైనా మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని సంపూర్ణంగా తీసుకుంటే బాగుంటుందని సలహాలు, సూచనలు వచ్చాయి, అందులో భాగంగానే హుజూరాబాద్ లో దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. ఇదేదో రోటిన్ వ్యవహారం కాదు గతంలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని కార్యక్రమం ఇది’’ అని సీఎం తెలిపారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా వివక్ష, ఆర్తి, బాధతో వున్న వర్గం ఎదైనా వుందంటే అది దళిత జాతేననే విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ కంపేరిటివ్ స్టడీలు నివేదికలు అందించాయని సీఎం అన్నారు. స్వాతంత్య్ర అనంతరం అరకొర అభివృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు ఇంకా రాలేదన్నారు.

దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఏటా బడ్జెట్ లో కేటాయింపులు:

ఒక కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే ఎట్లైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను యావత్ సమాజం బాగు చేసుకోవాల్సిన బాధ్యత వుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దారించుకుని అమలు చేస్తున్న పథకం దళితబంధు అని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడైతే వివక్ష విపరీతంగా వుంటుందో అక్కడ మేలుకొలుపు వుంటుందని, అట్లా చైతన్యం పొందిన వారే పోరాటం చేసి 100 శాతం విజయాన్ని సాధిస్తారని సీఎం తెలిపారు. తాను మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం కన్నాముందే ఇదే విషయాన్ని 1996 లో ఎస్ఆర్ఎస్పీ కాలువ మీద ప్రజలతో స్పష్టం చేశానన్నారు. అనుకున్నట్లే వివక్షకు గురైన నాటి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి విజయాన్ని సాధించామని సీఎం తెలిపారు. స్వరాష్ట్రంలో అనేక రంగాల్లో దేశం గర్వించదగ్గ అభివృద్ది సంక్షేమం సాధించామని చెప్పారు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఎదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదని దశలవారీగా విజయాన్ని చేరుకుంటామన్నారు. దశలవారిగా రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ లో నిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తామన్నారు.

పేరంటల్ అప్రోచ్ వుండాలే:

దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్ అప్రోచ్ తో పనిచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన దళితులను దళితబంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లాగా ఆదుకోవాలన్నారు. వారితో అధికార దర్పంతో కాకుండా కన్నబిడ్డను ఎట్లైతే తల్లిదండ్రలు ఆలనా పాలనా చూస్తారో ఆ పద్దతిలో వ్యవహరించాలన్నారు. సమన్వయకర్తల్లాగా కలిసి పనిచేయాలన్నారు. దళితుల్లో ఈ సందర్భంగా ఒక విశ్వాసాన్ని పాదుకొల్పాన్నారు. అధికారులు దళితుల అభివృద్ధి కోసం లీనమై రసించి పనిచేయాలన్నారు. దళితుబంధు పథకాన్ని తన భూజాల మీద మోయాల్సిన సమయం విద్యావంతులైన దళిత యువతకు ఆసన్నమయిందన్నారు. దళిత యువతను ఈ పథకంలో భాగాస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ పథకంలొ సపొర్టు స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. ఇందుకోసం రక్షణ నిధిని ఎర్పాటు చేసిన విషయం సీఎం వివరించారు.

వ్యాపార ఉపాధి రంగాల్లో రిజర్వేషన్:

ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్ షిప్ లు, ట్రాన్స్ పోర్టు పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బారు, వైన్ షాపులు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ‘‘అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృధ్ది చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేనని సీఎం స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అంబెడ్కర్ మహాశయుడు తీసుకువచ్చి అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పేమి జరుగలేదన్నారు. దళితబంధు పథకం అమలు తీరు అందుకు అనుసరించాల్సిన పద్ధతులు, విధి విధానాలు గురించి అధికారులు వివరించారు. మొదటిదశలో పథకం అమలు పటిష్టంగా జరగాలన్నారు. రెండవ దశలో పథకం పర్యవేక్షణ కీలకమన్నారు. దీనికి గాను జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి లబ్దిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబంధు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు కమిటీలు వుంటాయని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల ద్వారా లక్షకు పైగా దళిత బిడ్డలు దళిత జాతి సంరక్షణను తమ భుజాల మీద వేసుకొని నిర్వహించనున్నారని సీఎం పేర్కోన్నారు. తమ జాతి అభివృద్ధికి తామే స్వయంగా భాగాస్వాములను చేయడం ఈ పథకం గొప్పతనమన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నిక కాబడిన వారే రీసోర్స్ పర్సన్లుగా పనిచేస్తారన్నారు. పథకాలను ఎంచుకునే క్రమంలో పునరావృతం కాకుండా, లాభసాటిగా వుండేలా చూసుకోవాలన్నారు.

అశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే చక్కటి తెలంగాణ అభివృద్ధికి బాటలు పడతాయని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదన్నారు. బ్రాహ్మణులు తదితర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరుస్తున్నామన్నారు. కులం మతం అనే తేడా లేకుండా రైతు బంధు పథకాన్ని అన్ని వర్గాలకు అమలుచేస్తున్నామని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు. దళిత జాతి అభివృద్దిలో మీరు చాలా గొప్ప పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నానని, సమావేశంలో పాల్గొన్న నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి సీఎం అన్నారు. అధికార దర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధిని సాధించి తీరుతామని తనకు విశ్వాసం వుందన్నారు. దళితబంధు ద్వారా అందించే ఆర్థిక సహాయం బ్యాంకు లోను కాదు. తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ఇది ఫలానా పనిచేయాలనే ఒత్తిడి లేదు. వచ్చిన పని, నచ్చిన పనిని చేసుకోవచ్చనే విషయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలోని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలవుతున్న నేపథ్యంలో, క్షేత్ర స్థాయి అనుభవాలను సమావేశానికి వివరించాల్సిందిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు దళితబంధు అమలు తీరు తెన్నులను కలెక్టర్ వివరించారు. క్షేత్ర స్థాయిలో పథకం పట్ల తమకు సానుకూలంగా అద్భుతమైన స్పందన వచ్చిందని కలెక్టర్ వివరించారు. ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయిన కరీంనగర్ జిల్లా కలెక్టర్, దళిత ప్రజల మనోభావాలను, అధికార యంత్రాంగం అనుభవాలను సమావేశానికి వివరించారు. ఈ సందర్భంగా ఎంపిక కాబడిన మండలాల నియోజకవర్గాల జిల్లాల మంత్రులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను సీఎం సేకరించారు. దళిత బంధు పథకం ద్వారా దళిత జాతిని ఆర్థికంగా నిలదొక్కుకునే దిశగా నడిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఎం చేపట్టిన దళిత బంధు పథకం, దళితులను వ్యాపార వర్గంగా మలుస్తుందని సమావేశం విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం ఆలోచనలకు అనుగుణంగా తాము దళిత బంధు విజయవంతానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తామని సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.

‘‘వచ్చే ఏడాది నుండి బడ్జెట్ లో దళితబంధు పథకం కోసం రూ.20 వేల కోట్లకు తగ్గకుండా కెటాయించాలని ఆలోచన వుంది. ఆ లెక్కన సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పొతాము. ఆ తరువాత వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు ఈ పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి వుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశాం. రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు దళితబంధు పథకం అమలు విషయంలో కూడా మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలని’’ సీఎం పేర్కోన్నారు.

దళితబంధు పథకం కింద డైయిరీ యూనిట్స్ కు స్పందన ఎక్కువగా వస్తున్నందున ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ సహకార డైయిరీలతో ఒక జాయింట్ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రజలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సగటున ఎన్ని పాలను వినియోగించాలి? ప్రస్తుతం ఎంత వినియోగిస్తున్నారు? రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంత జరుగుతుంది? బయటి రాష్ట్రాల నుండి ఎంత దిగుమతి చేసుకుంటున్నారు? అనే అంశాలమీద సమీక్ష జరిపి దళితబంధులో డైయిరీ యూనిట్లను ప్రొత్సహించడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ డైరీ యూనిట్లను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సన్నాహక సమావేశంలో ఎస్సీ కులాల సంక్షేమం అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నల్లగొండ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీనియర్ దళిత రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు లింగాల కమల్ రాజ్, డి.శోభ, పి.పద్మావతి బంగారయ్య, జి.దీపిక పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పోరేషన్ ఎండి పి.కరుణాకర్, టిఎస్ఎస్ ఎండి జీ.టి. వెంకటేశ్వర్ రావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, సూర్యాపేట్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జితేష్ వి.పాటిల్, పి.ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 11 =