కరోనా వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి సిద్ధం: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Participated in Video Conference, CM KCR Participated in Video Conference Held by PM Modi, Coronavirus Live Updates, Covid-19 Vaccine Distribution, Mango News Telugu, PM Modi discuss Covid situation, PM Modi over Covid-19 and Vaccine Distribution, PM Modi Video Conference, PM Modi Video Conference On Covid 19 Vaccine, PM Modi virtual meet with states, Telangana CM KCR

శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానం పై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను చెప్పారు.

“వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించాం. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టీ మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటి విసి కరుణాకర్ రెడ్డి, కోవిడ్ నిపుణులు కమిటి సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇక వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్ పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =