హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి దగ్గర డాక్టర్ వసంత్‌కుమార్ ఈ రోజు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొవడంతో రెండ్రోజుల క్రితం వసంత్‌కుమార్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వసంత్ కుమార్ మంగళవారం ఉదయం పెట్రోల్ బాటిళ్లతో గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. సిబ్బంది అడ్డుకున్నా కూడా వసంత్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితి నెలకుంది.
ఆస్పత్రిలో వసతులు లేమిపై తాను ప్రశ్నించానని, ఎలాంటి తప్పు చేయకపోయినా తనను సస్పెండ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు తన సస్పెన్షన్ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సహచర వైద్యులు, పోలీసులు వసంత్‌కు ఎంత నచ్చజెప్పినా శాంతించలేదు. ఈ క్రమంలో పోలీసులు వసంత్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
[subscribe]