గుస్సాడీ కనకరాజుకు గవర్నర్ త‌మిళిసై సన్మానం

Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan Felicitates Gussadi Kanaka Raju, Gussadi Dance Master Kanaka Raju, Gussadi Kanaka Raju, Gussadi master contributions, Mango News, Padma Shri Award Winner, Padma Shri Award Winner Gussadi Kanaka Raju, Padma Shri Awardee Gussadi Kanaka Raju, Telangana Governor Tamilisai Soundararajan

గుస్సాడీ నృత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి, రాష్ట్రానికి గర్వకారణమైన పద్మశ్రీ కనకరాజును సన్మానించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీమ్-ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడీ నృత్య గురువు కనకరాజును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించినందున సోమవారం నాడు గవర్నర్ తమిళిసై కనకరాజును ఘనంగా సన్మానించారు. ఆదివాసి సంప్రదాయాలు గౌరవించబడాలనేది తన ఆకాంక్ష అని, ఈ ఆకాంక్ష కనకరాజుకు పద్మశ్రీ రావడం ద్వారా నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

“తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి కనకరాజు కావడం నిజంగా ఈ రాష్ట్రానికి గర్వకారణం. నాకు గిరిజనులంటే చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లోనే నా భర్త సౌందర్ రాజన్, మిత్రులతో కలిసి గిరిజనుల గురించి అధ్యయనం చేయడానికి అండమాన్ వెళ్లాను. నేను గవర్నర్ కాకముందు నుంచే గిరిజనులతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాను. ఎప్పుడూ వారి సంక్షేమాన్ని కోరుకున్నాను. గిరిజనుల వైద్యానికి ప్రత్యేకత ఉంది. వారి వైద్యం పట్ల పరిశోధన చేయాలి. వోకల్ ఫర్ లోకల్ అని మన ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు స్థానికులకు ప్రాధాన్యత ఉండాలని, వారు స్వయం సమృద్ధి కావాలన్నారు. గిరిజనుల ఆచారం, ఆహార అలవాట్ల వల్ల వారి వయసుకు తగినట్లుగా కాకుండా ఇంకా యవ్వనంగా ఉంటారని గుర్తించాను” అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

“గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్, మిగిలిన గిరిజనుల నుంచి నేను ఎప్పటికప్పుడు గిరిజనుల స్థితిగతులను విచారణ చేస్తుంటాను. ఎందుకంటే గిరిజనులు చాలా అమాయకులు. వారి ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి ఆచార వ్యవహారాలను పాటించే గిరిజనులకు నేడు పద్మశ్రీ పురస్కారంతో కేంద్రం గౌరవించడం నిజంగా ఎంతో సంతోషకరం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ణతలు. గిరిజనుల ఆచార వ్యవహారాలలోని నృత్యంలో నైపుణ్యం సాధించిన కనకరాజును దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో గౌరవించడం నిజంగా ఎంతో గర్వకారణం. మొదటి నుంచి గిరిజనుల పట్ల నాకు ఆసక్తి. వారి ఆచారాలను పరిరక్షించాలని, వారి జీవన విధానాలను మెరుగుపర్చాలని, వారి పోషకాహార లోపాలను తగ్గించాలని నేను ఆకాంక్షిస్తాను. గిరిజన పిల్లల పోషకాహార లోపాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలి. తన జీవితాంతం గిరిజన ఆచార వ్యవహారాల్లోని గుస్సాడీ నృత్యం కోసం పాటుపడడం, దానికి కేంద్రం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది” అని గవర్నర్ తెలిపారు.

“కనకరాజు తండ్రి కూడా గుస్సాడి నృత్యం కోసం చాలా పాటుపడ్డారని, తండ్రి వారసత్వాన్ని కనకరాజు కొనసాగించినందుకు వీరు చాలా గౌరవింపదగిన వారు. కనకరాజు జీవితం, అతను చేసిన కృషి, సాధించిన విజయాల గురించి పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో రైతులు జరుపుకునే సంక్రాంతి వంటి పండగలు వ్యవసాయంతో అనుబంధమైనవి. గిరిజనుల జరుపుకునే ఆచారాలు కూడా వ్యవసాయానికి సంబంధమైనవి. గుస్సాడీని కేంద్రం పద్మశ్రీతో గౌరవించడం ఆచారాలను, వ్యవసాయాన్ని కూడా గౌరవించినట్లు అయింది. కేంద్రం, రాష్ట్రం కలిసి గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలి. కళలకు ఇలాంటి పురస్కారం లభించడం వల్ల యువతకు ఇది స్పూర్తి కావాలి. కళలను భావితరాలకు అందించే ఈ వారసత్వాన్ని యువత కొనసాగించాలి. ప్రభుత్వం గిరిజనుల ఆచార వ్యవహారాల పట్ల పరిశోధన చేసే సంస్థను నిర్వహిస్తూ వాటిని పరిరక్షించడం నిజంగా అభినందనీయం. అదేవిధంగా గిరిజనుల అత్యంత ప్రాచీన కళలలో శిక్షణ కల్పించే సంస్థలు నిర్వహించడం కూడా అభినందనీయం. కనకరాజుకు ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం పట్ల నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. గిరిజనుల ఆర్ధిక పరిస్థితులు, మౌలిక వసతులు మెరుగుపర్చాలి. మన ప్రాచీన ఈ కళలను కాపాడేందుకు, భావితరాలకు వాటిని అందించేందుకు మనందరం పునరంకితం కావాలి” అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here