రాజయ్య ఆవేదన కడియం శ్రీహరికి మైనస్ అవుతుందా?

Internal differences in TRS are a plus for Congress,Internal differences in TRS,Internal differences plus for Congress,Mango News,Mango News Telugu,Candidate, Elections , Station Ghanpur Constituency, Station Ghanpur, Elections In Station Ghanpur Constituency , Congress, Rajaiah, Srihari,Station Ghanpur Constituency Latest News,Station Ghanpur Constituency Latest Updates,Station Ghanpur Constituency Live News,Internal differences in TRS Latest News,Telangana Politics,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Latest News and Updates
Candidate, Elections , Station Ghanpur Constituency, Station Ghanpur, Elections In Station Ghanpur Constituency , Congress, Rajaiah, Srihari,

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అంటేనే రాజకీయాలలో ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్‌లో ఏ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే ఆ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. ఇంకా చెప్పాలంటే 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య పోటీ చేస్తున్నారు. ఉపఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య.. తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు  కూడా సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బోలెడు ఆశలు పెట్టుకున్న రాజయ్యకు ఆ అవకాశాన్ని గులాబీ బాస్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని  ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ ఛాన్స్  ఇచ్చారు . టికెట్ దక్కక మొదట్లో ఆవేదన చెందిన రాజయ్యను.. చివరకు మంత్రి కేటీఆర్  సముదాయించి రైతుబంధు సమితి చైర్మెన్ పదవి ఇవ్వడంతోపాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. అంతేకాదు కడియం శ్రీహరితో సయోధ్య కూడా  కుదిర్చారు. అయితే ఇద్దరూ ప్రగతి భవన్ లో కలిసిపోయినా.. బయట మాత్రం అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఇతర పార్టీలో బలమైన నాయకులు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లేకపోవడం.. అధికార పార్టీకి కలిసివచ్చే అంశమే అయినా వర్గపోరు పార్టీని ఆగం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సందిట్లో సడేమియాలా దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు విపక్షాలు  విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.  దీంతో స్టేషన్ ఘనపూర్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఇదే అదునుగా చేసుకుని ఎలాగైనా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర, బీజేపీ నుంచి మాజీమంత్రి విజయ  రామారావు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో.. ప్రచారం ముమ్మరం చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.   మండలాల వారిగా  స్టేషన్ ఘనపూర్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినా.. ఈ సమ్మేళనాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య దూరంగానే ఉన్నారు. తన టికెట్ కడియం తన్నుకుపోయారనే ఆవేదనతో ఉన్న రాజయ్య.. బయట కడియంతో కలిసిపోయినట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఆయనకు చుక్కలు చూపించడానికి  సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటి వరకు  పద్నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ ఆరుసార్లు,టీడీపీ మూడు సార్లు, బీఆర్ఎస్ నాలుగు సార్లు తన జెండాలను ఎగురేసాయి.  అయితే ఈ సారి ఎన్నికల్లో.. వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి స్థానికంగా వివాదాస్పదంగా మారడంతోనే ఆ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. కడియం  రెండు సార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా..టీఆర్ఎస్ హయాంలో రాజయ్య తర్వాత ఉపముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఆయనపై సదాభిప్రాయం ఉన్నా కూడా.. మారుతున్న సామాజిక సమీకరణాలతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను కాదని.. కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో ఆ వర్గం అంతా కడియం శ్రీహరికి ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఓటములను తాటికొండ రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇటు కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన సింగపురం ఇందిర.. మరోసారి  ఈ నియోజకవర్గంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.  ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లను..  ప్రజల్లోకి తీసుకెళ్లి మరీ ఇందిరా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అలాగే మరోవైపు బీజేపీ నుంచి మాజీమంత్రి విజయ రామారావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత  ఆ పార్టీలో పనిచేసిన విజయరామారావు..తర్వాత బీజేపీలో  చేరి టికెట్ తెచ్చుకున్నా కూడా ప్రచారంలో వెనుకబడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం పేరు ఖరారై చాలా కాలమైంది. కాంగ్రెస్,బీజేపీలు తమ అభ్యర్థులను ఈ మధ్యనే ఖరారు చేశాయి. అయితే విజయరామారావును లైట్  తీసుకుంటున్న నియోజకవర్గంలోని ఓటర్లు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ అని భావిస్తున్నారు..

సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సానుభూతి ఉన్నా.. ఆయన వ్యవహారశైలితో ఇప్పటికే పార్టీకి కాస్త నెగటివిటీ వచ్చేసింది. ఇక కడియం శ్రీహరి మీద ఎలాంటి అవినీతి మరకా లేకపోయినా కూడా..రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్‌లోని ఈ  అంతర్గత వ్యవహారాలనే.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రెడీ అవుతుందన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =