సుజాతనగర్‌ నియోజకవర్గం.. రాజకీయ నేతల చరిత్రలు

Sujatanagar Has Disappeared From the Political Picture,Sujatanagar Has Disappeared,Disappeared From the Political Picture,Khammam, Sujathanagar, Telangana Assembly Elections, Telangana Politics,Mango News,Mango News Telugu,Sujatanagar Latest News,Sujatanagar Latest Updatesk,Telangana Latest News and Updates, Telangana Political News and Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
khammam, sujathanagar, telangana assembly elections, telangana politics

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సుజాతనగర్‌ నియోజకవర్గం.. తాజా రాజకీయ చిత్రపటం నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా.. 2009లో చేపట్టిన అదే పునర్విభజనలో  సుజాత నగర్ కనుమరుగైంది. సుజాత నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఏన్కూరు, జూలూరుపాడు, కామేపల్లి మండలాలు పూర్తిగా, ఖమ్మం అర్బన్‌, ఖమ్మం రూరల్‌, కొత్తగూడెం, టేకులపల్లి, కొణిజర్ల, కారేపల్లి,  గార్ల మండలాలు పాక్షికంగా ఉండేవి. ఇక్కడ ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తం ఎనిమిది సార్లు ఎన్నికలు జరగగా.. సీపీఐ నాలుగు సార్లు , కాంగ్రెస్‌ నాలుగు సార్లు విజయకేతనం ఎగురవేసింది.

సీపీఐ అభ్యర్థి మహమ్మద్‌ రజబ్‌ అలీ.. సుజాతనగర్‌ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి రికార్డులకెక్కరు. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా వెంకటరెడ్డి విజయం సాధించారు. ముప్పై ఏళ్లలో  కేవలం ముగ్గురు అభ్యర్థులే సుజాత నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో చేపట్టిన పునర్విభజనలో సుజాతనగర్ నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం, కొణిజర్ల మండలం, జూలూరుపాడు మండలం, కారేపల్లి మండలంతో పాటు.. మధిర నియోజకవర్గంలో కొనసాగిన వైరా మండలాన్ని కూడా కలిపి కొత్తగా వైరా నియోజకవర్గంగా ప్రకటించారు. దీంతో 30 ఏళ్లపాటు నియోజకవర్గంగా కొనసాగిన సుజాతనగర్‌.. గ్రామ పంచాయతీ కేంద్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో  భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కలిసింది. ఇప్పుడు సుజాత నగర్ మండల కేంద్రంగా కొనసాగుతుండగా.. నాటి రాజకీయ గురుతులు చరిత్రలో భాగంగా కలిసిపోయి ఎన్నో రికార్డులకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుజాతనగర్‌ తొలి ఎమ్మెల్యేగా బొగ్గారపు సీతారామయ్య గెలుపొందారు.  కాంగ్రెస్‌(ఐ) నుంచి పోటీ చేసిన సీతారామయ్య సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుపై విజయం సాధించారు . బొగ్గారపు సీతారామయ్య, పువ్వాడ నాగేశ్వరరావు ఇద్దరూ కలిసి న్యాయవిద్యను అభ్యసించినా.. పొలిటికల్ రంగంలో మాత్రం  ప్రత్యర్థులుగానే పోటీచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాదు.. నిజాం హైదరాబాద్‌ సంస్థానం పాలన విముక్తి కోసం జరిగిన పోరాటంలోనూ సీతారామయ్య పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాదిగా, శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షునిగా, ప్యానెల్‌ స్పీకర్‌గా కూడా సీతారామయ్య సేవలందించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం బలపర్చిన జనతా పార్టీ నుంచి పోటీ చేసిన  గోగినేని సత్యనారాయణ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. అంచనాలకు ఏమాత్రం అందని విధంగా ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన సీతారామయ్య గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేసిన సీతారామయ్య కరోనాతో మృతి చెందారు.

సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి  సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన  మహ్మద్‌ రజబ్‌ అలీ  వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. తొలిసారి 1983లో కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థి మహ్మద్‌ ఇస్మాయిల్‌ను ఓడించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ విజయం సాధించినా ఆ పార్టీ అభ్యర్థి సామినేని రాఘవులుకు మాత్రం  ఇక్కడ కేవలం 12 వేల ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత 1985, 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం మద్దతుతో వరుసగా సీపీఐ అభ్యర్ధి రజబ్‌ అలీ.. కాంగ్రెస్‌ నేత రాంరెడ్డి వెంకటరెడ్డిపై గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్‌ అధిష్టానం చేకూరి కాశయ్యకు టిక్కెట్‌ ఇవ్వగా.. రాంరెడ్డి వెంకటరెడ్డి స్వతంత్య అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

రజబ్‌ అలీ చనిపోయాక 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో.. కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్‌ పాగా వేసేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. సీపీఎం,తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన రాంరెడ్డి.. సీపీఐ అభ్యర్థి టీ.వీ.చౌదరిని ఓడించారు. 1999 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ హవా కొనసాగింది. తెలుగు దేశం పార్టీ నుంచి పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి బరిలో నిలవగా.. రాంరెడ్డి విక్టరీ సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోట్ల మాధవి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి పోటీ చేయగా.. రాంరెడ్డి మళ్లీ గెలుపొందారు. 1996, 1999, 2004లలో వరుసగా మూడుసార్లు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి హ్యాట్రిక్‌ కొట్టారు. 2009లో పునర్విభజనలో సుజాతనగర్‌ నియోజకవర్గం.. కనుమరుగు కావడంతో 2009, 2014 ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రాంరెడ్డి రెండు నియోజకవర్గాల్లో కలిపి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + seven =