కష్టపడి చదవండి, కలల్ని నిజం చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ లేఖ

Minister KTR Writes Letter To Telangana Youth Over Ongoing Recruitment of Govt Jobs, Recruitment of Govt Jobs, Minister KTR Writes Letter To Telangana Youth, Letter To Telangana Youth, Govt Jobs Recruitment, Telangana Minister KTR, Telangana Youth, Telangana Govt Jobs Recruitment, Govt Jobs, Minister KTR News, Minister KTR Latest News, Minister KTR Live Updates, Mango News, Mango News Telugu

రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో “కష్టపడి చదవండి, కలల్ని నిజం చేసుకోండి” అని తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఓ లేఖ రాశారు.

9 ఏళ్లలో సుమారు 2 లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం:

“మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో నవ శకానికి నాంది పలికింది. ఎన్నో ఆంక్షల నడుమ స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలుపెట్టి తొమ్మిది ఏండ్ల వ్యవధిలో సుమారు రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను సరికొత్తగా లిఖించబోతుందని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1 లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశాము. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక, 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టినం. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాము. మొత్తంగా రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది” అని మంత్రి కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది:

“ఇక ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. అడ్డంకిగా వున్న రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆర్‌డివో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది. దీంతో పాటు విద్యార్థులు, యువకుల కోరిక మేరకు కేసీఆర్ నేతృత్వంలోని మా ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పాల్గొనేందుకు మరింత మందికి అవకాశం దక్కింది. నిరుద్యోగ యువత కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, ఏళ్ళ తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాను. ఉద్యోగ ప్రకటనల జారీతో పాటు వేగంగా వాటిని భర్తీ చేసేందుకు గతంలో లేని భిన్నమైన నియామక ప్రక్రియను మా ప్రభుత్వం అమలుచేస్తున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో మాత్రమే కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వికేంద్రీకరించాము. ఫలితంగా సంవత్సరాల పాటు సాగే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమూలంగా మారి నియామకాలు వేగంగా జరుగుతున్నాయి” అని తెలిపారు.

ఇప్పటికే సుమారు 17 లక్షలమందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత మన రాష్ట్రానిదే:

“తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు భర్తీ చేసిన ఉద్యోగాల నియామక ప్రక్రియపై సైతం ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ఆ దేశాల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని గర్వంగా చెప్పగలను. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు వన్ ఉద్యోగాలలోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. అందుకే ఇప్పటిదాకా మా ప్రభుత్వం నింపిన ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అంశంపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అందుకే గతానికి భిన్నంగా ఇప్పటిదాకా ఈ అంశంపై ఒక్క వివాదం నెలకొనలేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. ఇప్పటిదాకా సుమారు 17 లక్షలమందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత మన రాష్ట్రానిదే. ఇవేకాదు అద్భుతమైన ఆవిష్కరణల ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఈకో సిస్టంను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పరిచింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టి.ఎస్.ఐ.సి. వంటి వేదికలను ఏర్పాటుచేసింది” అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు అత్యధిక జీతాలను చెల్లిస్తుంది, ఆ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి:

“ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువత కోసం కోచింగ్ సెంటర్లను ఇతర వసతులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నిరుద్యోగులకు శిక్షణా తరగతుల నిర్వహణ కూడా ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వం చేస్తున్న కృషి ఇవాళ ఫలించింది. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తున్నది. సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టండి. సానుకూల దృక్పథంతో సాధన చేసి, స్వప్నాలను సాకారం చేసుకోండి. కాలం తిరిగి రాదు. అవకాశాలను అందిపుచ్చుకోండి!, ఏకాగ్రతతో అభ్యసించండి. లక్ష్యాన్ని చేరుకోండి!, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు అత్యధిక జీతాలను చెల్లిస్తున్నది. ఆ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి!, ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్మకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలంగాణ యువతకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here