విజయవాడలో వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం ఆహ్వానించింది. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ని కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ ప్రతినిధి బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తదితర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దసరా శరన్నవరాత్రి వేడుకల ప్రాశస్త్యాన్ని, విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాల విశేషాలను ప్రసాదంతో పాటు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ మరియు శ్రేయాస్ మీడియా సంయుక్తంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ 2.0 అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు వైభవంగా జరగనుంది. పున్నమి ఘాట్, మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వేదికలుగా 10 రోజుల పాటు సాంస్కృతిక, కళా కార్యక్రమాలు, సంగీత విభావరిలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.
విజయవాడ ఉత్సవాల్లో పాల్గొని దసరా సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చాలని ఏపీ ప్రజాప్రతినిధులు కోరగా, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సోదరభావ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.







































