ఎస్ఏపీలో ఉద్యోగాల కోత.. 10 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

SAP Prepares Around 10,000 Job Cuts Amid AI-First Push, Affecting Roughly 9% of Staff

జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్ఏపీ (SAP) భారీ లేఆఫ్స్‌కు సన్నద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ – AI)పై మరింత దృష్టి కేంద్రీకరిస్తున్న సంస్థ, దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించే దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు 9 శాతం మందిని ప్రభావితం చేసేలా ఈ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని, ఇప్పటికే ఉద్యోగ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే మొత్తం ఎంతమందిని తొలగిస్తారనే దానిపై సంస్థ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

ప్రాడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఈ తొలగింపుల ప్రభావం అధికంగా ఉండనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో లేఆఫ్స్ సమయంలో ఉద్యోగులకు అనుకూలంగా వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వంటి విధానాలను అమలు చేసినట్లుగానే, ప్రస్తుత పరిణామాల్లోనూ ఉద్యోగులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

ఏఐ ఆధారిత ఉత్పత్తులు, ఫీచర్లను వేగంగా విస్తరించే లక్ష్యంతో సంస్థ పనిచేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తొలగింపుల సంకేతాలతో పాటు ఎస్ఏపీ ఉన్నత నాయకత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2027 మార్చి నాటికి ఆరుగురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఇద్దరు తప్పుకోనున్నట్లు సమాచారం.

ఇందులో చీఫ్ కస్టమర్ ఆఫీసర్ థామస్ సౌరెస్సిగ్ కూడా ఉన్నారని, వచ్చే ఏడాది మార్చి వరకు ఆయన కొనసాగి ఆ తర్వాత బయటి అవకాశానికి వెళ్లనున్నారని సంస్థ ప్రకటించింది. మే నెలలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ‘జూల్ వర్క్’ (Joule Work) పేరిట ఏఐ ఇంటర్‌ఫేస్‌ను ఆవిష్కరించిన ఎస్ఏపీ, జూల్ వర్క్, జూల్ స్టూడియో వంటి ఏఐ ఆఫరింగ్‌లను 2027 తొలి త్రైమాసికానికి (Q1 2027) వాయిదా వేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

తొలగింపులు ఉండవచ్చని గత వారమే ఇన్వెస్టర్ల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డొమినిక్ అసామ్ పేర్కొనగా, ఈ మార్పులు ఎప్పటి నుంచి అమలవుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, 2024లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలోనూ ఎస్ఏపీ సుమారు 10 వేల ఉద్యోగాలను తొలగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here