ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో 30 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించేలా ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల ద్వారా దాదాపు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
ఏపీ కేబినెట్ ఆమోదించిన కొన్ని కీలకాంశాలు
-
ఎంఎస్ఎంఈ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్: పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించేందుకు ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
-
కియా రెండో ప్లాంట్, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులు: పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళంలో రూ.13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్, అచ్యుతాపురంలో రూ.1,800 కోట్లతో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ పరిశ్రమకు పచ్చజెండా ఊపారు.
-
అమరావతి పనులకు నిధులు, వ్యయం పెంపు: హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెంచారు. అమరావతి గ్రామ పంచాయతీల మౌలిక వసతులకు రూ.1,215 కోట్లు, శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్లు, గ్రీన్‌వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చారు.
-
విద్యుత్, ఇంధన ప్రాజెక్టులు: విద్యుత్ అవసరాల కోసం కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఏపీజెన్‌కోకు అనుమతి ఇచ్చారు. కడప మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల భూమి కేటాయింపు, నంద్యాలలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీ, ప్రకాశంలో రోజుకు 12 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపారు.
-
భూ రికార్డుల సవరణ, కఠిన నిబంధనలు: అనంతపురంలో నిషేధిత జాబితా నుంచి 9,917 ఎకరాల తొలగింపు, 4,352 మంది పట్టాదారులకు లబ్ధి కలిగేలా భూ రికార్డుల సవరణకు అనుమతి ఇచ్చారు. రైల్వేకోడూరులో 10,192 ఎకరాల వెబ్‌ల్యాండ్ రికార్డుల సవరణకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ, అసైన్డ్, వివాదాస్పద భూములకు కొత్త హక్కులు కల్పించరాదని స్పష్టమైన నిబంధనలు విధించారు.







































