కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, 50 వేలమందికి పరీక్షలు

CM KCR High level Review meeting, Corona Containment Measures, Coronavirus, COVID-19, India COVID 19 Cases, KCR Review Meeting, KCR Review Meeting On Containment Measures, KCR Review Meeting on Spread of Corona Virus, telangana, Telangana CM KCR, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Total COVID 19 Cases

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని ఈ సమీక్షా సమావేశంలో అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని వారు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వారిని ఆదేశించారు.

‘‘హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరు ప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నోకొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్ గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి (హోం ట్రీట్ మెంట్)’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

‘‘హైదరాబాద్ ను కాపాడుకోవాలనే ముందు చూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉందని” సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + six =